మహిళా ఎన్‌ఆర్‌ఐ ‘చెత్త’ బిజినెస్‌.. రూ.1000 కోట్లు టార్గెట్‌ Meet NRI Poonam Gupta who failed to get a job started selling waste | Sakshi
Sakshi News home page

మహిళా ఎన్‌ఆర్‌ఐ ‘చెత్త’ బిజినెస్‌.. రూ.1000 కోట్లు టార్గెట్‌

Published Tue, Apr 2 2024 1:44 PM

Meet NRI Poonam Gupta who failed to get a job started selling waste - Sakshi

ఉన్నత చదువులు చదువుకుంది. కానీ ఆశించిన ఉద్యోగమేదీ రాలేదు. రిస్క్‌ చేయాల్సిందే అని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయమే ఆమెను రూ. 800 కోట్ల కంపెనీకి అధిపతిగా మార్చింది. గట్టి కృషి, పట్టుదలతో వ్యాపార వేత్తగా రాణిస్తోంది. ఎంతోమంది మహిళా పారిశ్రామిక వేత్తలకు, పర్యావరణవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త, పూనమ్ గుప్తా స్ఫూర్తిదాయక గాథను తెలుసుకుందాం రండి..!

ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త పూనమ్ గుప్తా ఢిల్లీలో 1976, ఆగష్టు 17న ఢిల్లీలో పుట్టింది. లేడీ ఇర్విన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం. ఆ తర్వాత, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్‌, ఢిల్లీ FORE స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, హాలెండ్‌లోని మాస్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది. 

2002లో  వివాహం కావడంతో  భర్త పునీత్‌ గుప్తాతో కలిసి స్కాట్లాండ్‌కు వెళ్లారు. స్కాట్లాండ్‌లో  ఆమెకు ఉద్యోగం దొరక లేదు. అర్హతలున్నప్పటికీ, పదేపదే తిరస్కరణలను ఎదుర్కొంది.  సాధారణంగా ఎన్‌ఆర్‌ఐలకు ఎదురయ్యే అనుభవమే ఇది.  ఇదే సమయంలో అనారోగ్యంతో  తల్లి ఆకాల మరణం ఆమెను మరింతషాక్‌కు గురిచేసింది.

అయినా ఎక్కడా నిరాశ చెందకుండా విభిన్నంగా ఆలోచించింది. వ్యాపారంవైపు అడుగులు వేసింది. అలా 2003లో స్కాట్లాండ్‌లోని కిల్మాకోమ్‌లోని కేవలం రూ. లక్ష పెట్టుబడితో  పర్యావరణ స్పృహతో, రీసైకిలింగ్‌ బిజినెస్‌ పీజీ పేపర్ కంపెనీ లిమిటెడ్‌ను స్థాపించింది. స్క్రాప్ పేపర్‌ను రీసైక్లింగ్ చేయాలనే ఆలోచనతో స్కాటిష్ ప్రభుత్వ అనుమతి తీసుకొని  మరీ దీన్ని స్థాపించింది.

మొదటి రెండేళ్లు పూనమ్ ఒంటరిగానే పనిచేసింది. రెండేళ్ల తర్వాత, ఒక స్నేహితుడు ఆమెతో పార్ట్ టైమ్ ప్రాతిపదికన చేరాడు. వ్యాపారం విస్తరించడంతో భర్త రూ. 1.5 కోట్ల ప్యాకేజీతో కంపెనీలో చేరడం విశేషం.

యూకేలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పేపర్ కంపెనీలలో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ ప్రస్తుతం ఏడాదికి 800 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా యూరప్, అమెరికాలోని కంపెనీల నుంచి చిత్తు కాగితాలను కొనుగోలు చేసి, దాన్నుంచి  మంచి నాణ్యమైన కాగితాన్ని కూడా తయారు చేసి ఇతర దేశాలకు  ఎగుమతిచేస్తుంది. ఇలా పీజీ పేపర్ ప్రపంచంలోని 53 దేశాల నుండి వస్తువులను దిగుమతి, ఎగుమతులను చేస్తుంది. పీజీ కంపెనీ ఉత్పత్తులను తొలుత ఎగుమతి చేసింది ఇండియాకే.

ఇక్కడితో ఆగిపోలేదు. హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్. మెడికల్‌తో సహా ఐటీ రంగంలోకి కూడా ప్రవేశించింది. దాదాపు 350 మంది ఉద్యోగులతో స్కాట్లాండ్‌ ప్రధాన కార్యాలయం వేదికగా తన సేవల్ని అందిస్తోంది. 7 దేశాలలో ఉన్న అనేక కార్యాలయాలతో 9 కంపెనీలున్నాయి. రానున్న కాలంలో పీజీ పేపర్ ఆదాయం రూ. 1000 కోట్లను అధిగమించాలనేది పూనమ్ గుప్తా  టార్గెట్‌.

పీజీ  పేపర్‌ సీఈవో, యూకేలో  ఉమెన్స్ ఎంటర్‌ప్రైజ్ స్కాట్లాండ్ అంబాసిడర్, అత్యంత గుర్తింపు పొందిన పారిశ్రామిక వేత్తలలో ఒకరు, యూ​కే-ఇండియా సంబంధాలలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది నాయకులలో ఒకరిగా పేరొందారు పూనమ్‌. స్థానిక, జాతీయ , అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలకు వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తారు. భారత్‌లోని యువతుల విద్యకోసం, మహిళలను సాధికారతకు  తప్పకుండా మద్దతు నిస్తున్న గొప్ప దాత కూడా. ఈమెకు ఇద్దరు కుమార్తెలు  సాన్వి, అన్య, 

“వ్యాపారం చేయాలనే ఆలోచన మాత్రమే సరిపోదు; రంగంలోకి దిగాలి.  పరిశోధన చేయాలి, ఎక్కడో ఒక చోట మొదలు ప్రారంభించండి లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. అలాగే మీ లాభాలను కంపెనీకి తిరిగి ఇవ్వడం మర్చిపోవద్దు’’ - పూనం గుప్తా

Advertisement
 
Advertisement
 
Advertisement