సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం | Bonala Sambaralu grand celebrations Singapore Telugu Samajam | Sakshi
Sakshi News home page

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం

Jul 12 2025 4:31 PM | Updated on Jul 12 2025 4:43 PM

Bonala Sambaralu grand celebrations Singapore Telugu Samajam

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో సుమారు 900 మంది భక్తులతో  ఈ వేడుకు ఘనంగా జరిగింది. అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.

బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాళికా అమ్మవారికి   వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించిన బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు.  మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా   నిలిచాయి. ఈ సందర్భంగా  సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకుడు బోయిన సమ్మయ్య తెలిపారు.

బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిచారంటూ సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి  సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి స్పాన్సర్‌ వజ్ర రియల్‌ఎస్టేట్‌కు అభినందనలు తెలిపారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు, హాజరైన భక్తులు అందరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు ఈ వేడుకలో భాగం పంచుకున్నారని, తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement