
గ్లాస్గో (స్కాట్లాండ్): నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మదర్ ఎర్త్ హిందూ టెంపుల్‌లో బతుకమ్మ వేడుకలను శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టెంపుల్ అధ్యక్షుడు డా. పునీత్ బెడి,,ఉపాధ్యక్షురాలు డా. మమత వుసికాలా ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.
గత మూడు సంవత్సరాలుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న ఈ దేవాలయం, ఈ ఏడాది బతుకమ్మ పండుగను ప్రత్యేకంగా జరిపింది. డా. మమత వుసికాలా, వినీల బత్తులా, వారి స్నేహితులు, దేవాలయ కమిటీ సభ్యుల సమన్వయంతో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించారు.
మహిళలు అందరూ రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేసి, సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో గానం చేస్తూ, నృత్యాలు, కోలాటం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా టెంపుల్‌లో భక్తి శ్రద్ధలతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా గడిపారు. అనంతరం సమీప సరస్సులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పండుగ అనంతరం భోజన విందు కూడా ఏర్పాటు చేయగా, అందరూ మంచి ఆహారం ఆస్వాదిస్తూ, ఉత్సాహంగా ఉత్సవాన్ని ముగించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందాన్ని ప్రకటించారు.