ఎన్నారై టీనేజర్ల దారుణ హత్యలు: మొన్న మెహక్.. నిన్న కౌర్

టొరంటో: విదేశాల్లో భారతీయులపై, భారత సంతతికి చెందిన వాళ్లపై దాడుల పర్వం కొనసాగుతోంది. నవంబర్ 22వ తేదీన బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో మెహక్‌ప్రీత్ సేథి(18) అనే భారతీయ విద్యార్థిని దుండుగులు పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ఆ టీనేజర్ కుటంబానికి సంఘీభావం తెలియజేస్తూ ర్యాలీ సైతం నిర్వహించారు అక్కడి ఎన్నారైలు. తాజాగా..
కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక సిక్కు యువతి(21) ప్రాణాలు కోల్పోయింది. మిస్సిసౌగా నగరంలోని బ్రంప్టన్‌కు చెందిన కెనడా పౌరురాలు పవన్‌ప్రీత్ కౌర్ రాత్రి 10.40 గంటల సమయంలో గ్యాస్ స్టేషన్ సమీపంలో ఉండగా దుండగుడొకడు దగ్గర్నుంచి కాల్పులు జరిపి, పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
కౌర్ అక్కడికక్కడే చనిపోయిందని పోలీసులు తెలిపారు. ఎవరో కావాలనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నామన్నారు. పంజాబీ కుటుంబానికి చెందిన కౌర్ మరణంతో ఆమె తల్లి గుండెలు పగిగేలా రోదిస్తోంది.