● ఆనాటి ప్రేమ, ఆప్యాయతలేవీ?
● ఆ అను‘బంధాల’ను గుర్తుచేసుకోవడం లేదని పలువురి ఆవేదన
● రెట్రో ఫొటోలపై జోరుగా చర్చ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పాత కాలపు దుస్తులు, కళ్లద్దాలు, వింటేజ్ గెటప్‌లతో రెట్రో ఫొటోలు సోషల్ మీ డియాను షేక్ చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వారిలో చాలామంది పాతకాలపు లుక్‌లో తమను తాము చూసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. డిజిటల్ ప్రపంచంలో ఇదొక ట్రెండ్‌గా మారింది. ఒకరినిచూసి మరొకరు ఈ ట్రెండ్‌ను పాలో అవుతున్నారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. పాతకా లం నాటి ఫొటోల కోసం చూపిస్తున్న ఆరాటం.. ఆనాడు మనుషుల మధ్య ఉన్న స్వచ్ఛమైన అనుబంధాలు, బంధాల విలువలను గుర్తు చేసుకోవడంలో ఎందుకు లేదన్న ప్రశ్న ఉదయిస్తోంది.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. కష్టసుఖాల్లో కుటుంబ సభ్యులతోపాటు ఇరుగుపొరు గు వారు అండగా నిలిచేవారు. కల్మశం లేని ప్రే మలు, ఆప్యాయ పలకరింపులు.. క్రమంగా దూర మవుతూ వచ్చాయి. టెక్నాలజీ ప్రపంచాన్ని దగ్గర చేసినా, మనుషుల మధ్య గోడలను మరింత పెంచింది. ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్నా.. ఎవరి లోకం వారిదే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అప్పట్లో ఉత్తరం వచ్చే వరకు ఎదురుచూసే నిరీక్షణలో ఒకరకమైన ప్రేమ, ఆర్ధ్రత కనబడేవి. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుతున్నపుడు కళ్లముందు ఉన్నట్టే అనిపిస్తున్నా హృదయాల మధ్య దగ్గరితనం కనిపించడం లేదు.
ఉమ్మడి జీవనం... మధుర జ్ఞాపకమే!
ఆ రోజుల్లో రెండు, మూడు తరాల వారు కూడా ఉమ్మడిగానే కలిసి జీవనం సాగించేవారు. పిల్లలు, పెద్దలతో ఇళ్లన్నీ సందడిగా ఉండేవి. తాత, నాయనమ్మలు చెప్పే నీతికథలు, బతుకు పాఠాలు పిల్లల ఉన్నతికి దోహదపడేవి. పండుగల సమయంలో అయితే ఏ ఇంటికి వెళ్లినా సందడే సందడి. ఆపదొస్తే ఒకరికొకరు ధైర్యం చెప్పుకునేవారు. ఎంత పెద్ద కష్టమొచ్చినా భరోసా ఉండేది. భార్య,భర్తల మధ్య విభేదాలు తలెత్తితే.. పెద్దలు, ఇరుగుపొరుగువారు సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు అంతా మారిపోయింది. బతుకుదెరువు, ఉద్యోగం, ఉపాధి, చదువులంటూ పట్టణాలకు వలసలు వెళుతుండడంతో కుటుంబాలు చిన్నగా మారిపోయాయి. ఇంట్లో తాతయ్యలు, నానమ్మలు లేకపోవడంతో పిల్లలకు జీవిత పాఠాలు చెప్పేవారు కరువయ్యారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ 80ల నాటి లుక్‌లో తమను తాము చూసుకుంటూ తెగ మురిసిపోతున్న జనం.. ఆనాటి బంధాల విలువను సైతం గుర్తు చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ అంశంపై సీనియర్ సిటిజన్స్‌తోపాటు పలువురు చర్చించుకుంటున్నారు. ఆనాటి బంధాలను, విలువలను గుర్తు చేసుకుంటున్నారు. కరిగిపోతున్న మానవ సంబంధాల విలువలను గుర్తించాలని, ఆనాటి స్వచ్ఛమైన మనసులు, పటిష్టమైన బంధాలను దైనందిన జీవితంలోకి తెచ్చుకోవడానికి నయా ట్రెండ్ ప్రారంభం కావాల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


