● అదనపు కలెక్టర్ భుజంగరావు
● జీజీహెచ్‌లో ‘నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’
నిజామాబాద్‌అర్బన్: యువత ఏ సందర్భంలోనైనా మత్తు పదార్థాలకు బానిసకావొద్దని, మత్తు పదార్థాలు లేని భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ భుజంగరావు ఉద్బోధించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ, మేరా యువ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ 100 ఆదివారాల కార్యక్రమం నిర్వహించారు. నా ఆరోగ్యమే నా గర్వకారణం అనే నినాదంతో సంతకాలు సేకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలై వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కుటుంబం, స్నేహితులు, బంధువులకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. డ్రగ్స్ రహి త భారతదేశం కోసం పాటుపడాలన్నారు. ప్రధా నంగా ప్రొఫెషనల్ కాలేజీలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ మాట్లాడుతూ యువత కోసం 100 ఆదివారాలు ప్రత్యేకంగా పని చేస్తున్నామన్నారు. యువతకు బీఎంఐ, హైట్, వెయిట్, బీపీ నిర్ధారణ పరీక్షలు, టీబీ ఎంబీఏ నిక్షయమిత్ర నమోదు, ఎక్స్‌రే, రక్త పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మానసిక వ్యాధుల నిపుణులు విశాల్ మాట్లాడుతూ యువత భారతదేశ భ విష్యత్ తరాలకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, మేరా యువ భారత్ జిల్లా అధికారి రమేశ్, డీప్యూటీ డీఎంహెచ్‌వో సికందర్ నాయక్, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.


