ఎంపికలో జాప్యం.. ఆశావహుల్లో నైరాశ్యం | - | Sakshi
Sakshi News home page

ఎంపికలో జాప్యం.. ఆశావహుల్లో నైరాశ్యం

Sep 25 2026 2:17 AM | Updated on Sep 25 2026 2:17 AM

దరఖాస్తుల వెరిఫికేషన్‌ పూర్తయింది..

● బోధన్‌లో మూడేళ్ల క్రితమే పూర్తయిన

డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు

● ఇప్పటికీ అర్హులకు అందించని అధికారులు

బోధన్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడానికి డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇందులో భాగంగా పట్టణంలోని పాండుతర్ఫా శివారులో ఏడేళ్ల క్రితం 360 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయం నిర్మాణం చేపట్టగా, మూడేళ్ల క్రితం పనులు పూర్తయ్యాయి. కానీ ఇప్పటికీ లబ్ధిదారులకు అందించకపోవడంతో ఆశావహుల్లో నైరాశ్యం నెలకొంది. ఈ అంశంపై పలు దఫాలుగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షలు నిర్వహిస్తున్నా.. పంపిణీలో మాత్రం తీవ్ర జాప్యం నెలకొంటుంది. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా మాట్లాడుతూ.. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు పూర్తి చేసిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఈ నెలాఖరు వరకు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశించారు. దీంతో ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్న పట్టణ పేదలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇళ్లు 360.. దరఖాస్తులు 6882..

పట్టణంలో మొత్త 38 వార్డులు ఉండగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం సుమారు 6882 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 360 ఇళ్లు ఉండగా పంపిణిలో జాప్యం జరుగుతుంది. పేదల నుంచి వెల్లువలా దరఖాస్తులు రావడం, మారిన రాజకీయ పరిస్థితులు, ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పలు చోట్ల వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు నెలక్రితం ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి లబ్ధిదారుల ఎంపికను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు అధికారులు వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేయించారు. దరఖాస్తుదారుల్లో సుమారు 2వేల మంది పైచిలుకు అర్హులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. వార్డుల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి వెంటనే అందించాలని పేదలు కోరుతున్నారు.

పట్టణ పేదలు డబుల్‌ ఇళ్ల కోసం పెట్టుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయికి వెళ్లి వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేశాం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రాసెస్‌లో ఉంది. ప్రభుత్వ నిబంధనలు, జిల్లా అధికారులు మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపికను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టిసారించాం.

–విజయ కుమారి, ఆర్డీవో బోధన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement