ఊరు హైరానా | - | Sakshi
Sakshi News home page

ఊరు హైరానా

Sep 25 2026 1:53 AM | Updated on Sep 25 2026 1:53 AM

మాక్లూర్‌(ఆర్మూర్‌): రెవెన్యూ రికార్డులు ఒకరిద్దరు రైతులను కాదు.. ఏకంగా ఊరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. తలదాచుకునేందుకు గూడు కట్టుకుందామనుకుంటే అనుమతి రాదంటూ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ పరిస్థితి మాక్లూర్‌ మండలం గుంజ్లి గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం గ్రామ పంచాయతీకి వెళ్లిన వారికి అసైన్డ్‌ భూమిలో అనుమతి ఇవ్వడం కుదరదని పంచాయతీ కార్యదర్శి నిరాకరిస్తున్నారు. మరి తమ పరిస్థితి ఏమిటని పంచాయతీ అధికారితోపాటు పాలకవర్గాన్ని గ్రామస్తులు ప్రశ్నిస్తే వారి వద్ద సమాధానం కరువైంది. ఇక తాము ఇళ్లు ఎక్కడ నిర్మించుకోవాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే అనుమతి లేకున్నా కొందరు ధైర్యం చేసి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభిస్తే విద్యుత్‌ అధికారులు కనెక్షన్‌ ఇవ్వడం లేదు. ఇప్పటికీ సుమారు 20 కుటుంబాలు దీపం వెలుగులో కాలం వెళ్లదీస్తున్నాయి. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గత కొన్నేళ్లుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన సుమారు 90 కుటుంబాలు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభించక, నిర్మించుకున్న ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్‌ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

మా నాన్నల కాలం నుంచి..

మా గ్రామం మొత్తం అసైన్‌మెంట్‌ భూములే. మా నాన్న ల కాలం నుంచి రికార్డుల్లో అంతే ఉన్నాయి. పాత గ్రా మంలో ఉన్న ఇళ్లు శిథిలావస్థకు చేరి కూలిపోతుండడంతో దుబ్బ ప్రాంతంలో కొత్తగా ఇళ్లు నిర్మించుకుంటున్నాం. కానీ గ్రామ పంచాయతీ పర్మిషన్‌ ఇవ్వడం లే దు. దైర్యం చేసి ఇల్లు నిర్మించుకుంటే విద్యుత్‌ అధికారులు కనెక్షన్‌ ఇవ్వడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామంలో పట్టా భూములే లేని విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలి. – సుంకె గంగాధర్‌, గుంజ్లి

ఇబ్బందిగా ఉంది

మా గ్రామం మొత్తం అసైన్డ్‌ భూమిగా రికార్డుల్లో ఉంది. ఈ విషయం అధికారులకు కూడా తెలుసు. కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ నుంచి అనుమతి ఇచ్చే అవకాశం లేదు. ఈ విషయం తెలియక కొందరు మమ్మల్ని నిందిస్తుండడంతో ఇబ్బందిగా ఉంది. ఉన్నతాధికారులు స్పందించి. పట్టా, అసైన్డ్‌ భూమి అనకుండా కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారందరికి అనుమతులు మంజూరు చేసే అవకాశం ఇవ్వాలి.

– గోపు గోపి, సర్పంచ్‌, గుంజ్లి

మాక్లూర్‌ మండలం గుంజ్లి గ్రామం మొత్తం అసైన్డ్‌ భూమే..

ఇళ్ల నిర్మాణానికి, కరెంట్‌ కనెక్షన్‌లకు అనుమతి నిరాకరణ

ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement