కోరిన కోరికలు తీర్చే సత్య(కర్ర) గణపతికి భక్తులు లక్షల రూపాయలతో అలంకారం చేశారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కొలువైన సత్యగణపతిని రూ.9,99,999 నగదుతో అలంకరించారు. ఇందులో కొత్తగా వచ్చిన రూ.10 నాణేలతోపాటు రూ.20, రూ.50, రూ.100, రూ.500 కరెన్సీ నోట్లను దండలుగా గుచ్చి మండపం నలుమూలలా అమర్చారు. లంబోదరుడు ‘ధనలక్ష్మి’ అవతారంలో మెరిసిపోతూ గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతీ ఏటా వినూత్నంగా ముస్తాబు చేయడం ఆనవాయితీగా వస్తోంది. శుక్రవారం శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
– డొంకేశ్వర్(ఆర్మూర్)


