● నేడు గణేశ్ శోభాయాత్ర
● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార
యంత్రాంగం
● భారీ పోలీసు బందోబస్తు
నిజామాబాద్ రూరల్: నవరాత్రులు మండపాల్లో పూజలందుకున్న గణనాథుడి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా వినాయక శోభాయాత్ర శుక్రవారం వేడుకగా జరుపనున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. శోభాయాత్ర సాగే మార్గాల్లో రోడ్డు మరమ్మతు పనులు, విద్యుత్ స్తంభాలకు లైట్లను బిగించారు.
నగరంలో ప్రత్యేకం..
ఇందూరులో నిర్వహించే శోభాయాత్రకు రాష్ట్రంలోనే పేరుంది. 80 ఏళ్లుగా సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతూ వస్తోంది. నగరంలోని దుబ్బ చౌరస్తా నుంచి 11 జతల ఎడ్లతో రథం బయలుదేరుతుంది. ఈ నేపథ్యంలో సార్వజనిక్ గణేశ్ మండలి ప్రతినిధులు రథానికి మరమ్మతులు చేయించారు. దుబ్బ చౌరస్తాలో మొదలై లలితామహల్ థియేటర్, గంజ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, పవన్ థియేటర్, అహ్మదీ బజార్, గాజుల్‌పేట్, పెద్ద బజార్, గోల్ హనుమాన్, ఫులాంగ్ మీదుగా వినాయక్‌నగర్‌లోని వినాయకులబావి వద్దకు చేరుకుంటుంది. రథయాత్ర కొనసాగే రూట్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది రథాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
మద్యం షాపులు బంద్
శుక్రవారం ఉదయం 6 నుంచి ఈ నెల 27 తేది ఉదయం 6 గంటల వరకు జిల్లాలో మద్యం షాపులు మూసి ఉంచనున్నట్లు సీపీ సాయి చైతన్య, ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ నందన్ కుమార్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
గణేశ్ నిమజ్జన రూట్‌లు..
ఎనిమిది ఫీట్ల లోపు విగ్రహాలు: నెహ్రూ పార్క్, అర్సపల్లి, జాన్కంపేట్, నవీపేట మీదుగా బాసరకు వెళ్లాలి.
ఎనిమిది ఫీట్ల కన్నా ఎత్తు విగ్రహాలు: ఫులాంగ్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్టాండ్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, దుబ్బా, జీజీ కాలేజీ చౌరస్తా, బైపాస్ రోడ్, డీఎస్ చౌరస్తా, ముబారక్‌నగర్, దాస్‌నగర్, మాక్లూర్, నందిపేట మీదుగా ఉమ్మెడ గోదావరికి వెళ్లాలి. నందిపేట మీదుగా నవీపేట, బాసర గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లొచ్చు.
ట్రాఫిక్ డైవర్షన్..
హైదరాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు మాధవనగర్ బైపాస్, కంఠేశ్వర్, రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ మీదుగా బస్టాండ్ చేరుకోవాలి.
బోధన్ వైపు నుంచి వచ్చే వాహనాలు అర్సపల్లి చౌరస్తా మీదుగా బైపాస్, కొత్త కలెక్టరేట్, కంఠేశ్వర్, రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బస్టాండ్ చేరుకోవాలి.
బాన్సువాడ నుంచి వచ్చే వాహనాలు వర్ని చౌరస్తా, ఆర్‌ఆర్, ఫులాంగ్ చౌరస్తా, ఎల్లమ్మగుట్ట, రైల్వేస్టేషన్ మీదుగా బస్టాండ్ చేరుకోవాలి.
బందోబస్తు..
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా పోలీస్ శాఖ ట్రాఫిక్ నియంత్రణ చేపట్టింది. పలు ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 11 నుంచి శనివారం ఉదయం 11 గంటల వరకు భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకూడదని అ ధికారులు తెలిపారు. 1300 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. ఇప్పటి వరకు 572 మందిని బైండోవర్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే వినియోగించిన వారిపై జిల్లా వ్యాప్తంగా తొమ్మిది కేసులు నమోదయ్యాయి.


