నిజామాబాద్ అర్బన్/నందిపేట్/ఆర్మూర్/నవీపేట్: గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, మండపాల నిర్వాహకులు పో లీస్‌శాఖకు సహకరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా, సీపీ సాయిచైతన్య కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని వినాయకుల బావిని పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో శోభాయాత్ర కొనసాగానే మార్గాలను పరిశీలించారు. నందిపేట మండలం ఉమ్మెడ, నవీపేట మండలం యంచ గోదావరి బ్రిడ్జీల పరిసరాలతోపాటు ఆర్మూర్‌లోని గుండ్ల చెరువును పరిశీలించారు. గోదావరిపై ఉన్న బ్రిడ్జీల వద్ద భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అవసరమైన క్రేన్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, జనరేటర్, అంబులెన్స్, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. శోభాయాత్ర రూట్లలో అవసరమైన చోట్ల రోడ్ల మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి బిగించాలని సూచించారు. నిమజ్జనోత్సవంలో ఏ చిన్న అపశ్రుతి జరుగకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. పోలీస్, ఫైర్, ఆర్ అండ్ బీ, విద్యుత్, పంచాయతీ రాజ్, పిషరీస్, రెవెన్యూ తదితర శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పోలీసులతో సమన్వయం చేసుకుని వారి సూచనలు పాటిస్తూ, నిర్దేశించిన మార్గం మీదుగా శోభాయాత్ర కొనసాగించాలని గణేశ్ మండపాల నిర్వహకులను కలెక్టర్ కోరారు.
నిర్దేశించిన రూట్లలోనే శోభాయాత్ర కొనసాగాలి
క్రేన్‌లు, గజ ఈతగాళ్లను
అందుబాటులో ఉంచండి
కలెక్టర్ భవేశ్ మిశ్రా, సీపీ సాయిచైతన్య ఆదేశాలు
ఉమ్మెడ, యంచ బ్రిడ్జీలతోపాటు
వినాయకుల బావి పరిశీలన


