నిజామాబాద్ లీగల్ : త్వరితగతిన కేసుల పరిష్కా రం కోసం తెలంగాణ మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్, జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో మీడియేషన్ ఫర్ నేషన్ 3.0 కార్యక్రమం ప్రారంభించామని జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి అన్నారు. న్యాయమూర్తులతో కలిసి జిల్లా జడ్జి భారతలక్ష్మి కోర్టు ఆవరణలో మీడియేషన్ ఫర్ నేషన్ పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం లేక మీడియేషన్ ద్వార త్వరితగతిన కేసుల పరిష్కారానికి అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని మీడియేషన్ ఫర్ నేషన్ 3.0 కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో రెండుపార్టీల వారితో మీడియేటర్ మాట్లాడి త్వరితగతిన పరిష్కారానికి ప్రయత్నిస్తారని, ఈ పరిష్కార ప్రక్రియకు చట్టబద్ధత ఉంటుందని అన్నారు. 1 అక్టోబర్ 2026 నుంచి 31 డిసెంబర్ 2026 వరకు మీడియేషన్ కార్యక్రమం కొనసాగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి నీలిమ, న్యాయమూర్తులు కే ఉషారాణి, డి దుర్గాప్రసాద్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


