సిరికొండ: రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో సిరికొండ సత్యశోధక్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాణించారని ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య తెలిపారు. తెలంగాణ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇటీవలన నిర్వహించిన రాష్ట్ర సబ్ జూనియర్ అండర్–15 విభాగం పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అజయ్, హర్షిత్, శ్రీకాంత్, సాయితేజ ప్రతిభ కనబర్చి జట్టు ద్వితీయ స్థానం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించిన విద్యార్థులను పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ మెడల్స్ అందజేసి అభినందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రహిత
గ్రామంగా మార్చుదాం
డిచ్‌పల్లి: మండలంలోని సుద్దపల్లి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చుకుందామని సర్పంచ్ పానుగంటి రూప సతీశ్‌రెడ్డి, ఉప సర్పంచ్ క్రాంతికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు జీపీ పాలకవర్గం గ్రామంలో ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులను పూర్తిగా నిషేదించారు. వాటికి బదులుగా స్టీల్ భోజన ప్లేట్లు, స్టీల్ గ్లాసులు మాత్రమే ప్రతి అన్నదాన కార్యక్రమం, శుభకార్యక్రమాల్లో వినియోగించాలని తెలిపారు. ఇందు కోసం 800 స్టీల్ ప్లేట్లు, 400 స్టీల్ గ్లాసులను దాతల సాయంతో కొనుగోలు చేసినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శి రాజేశ్వర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు దుంపటి భూమయ్య, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, వార్డు సభ్యులు చిరంజీవి, నవీన్, గ్రామస్తులు వినోద్ రెడ్డి, మోహన్, గణేశ్, సంతోష్, రణదీప్, ప్రసాద్, సాయి కుమార్ పాల్గొన్నారు.
భిక్కనూరు: సార్.. యాదికొస్తున్నారు మీరు నేర్పిన పాఠాలు, క్రమశిక్షణ ఎప్పటికి మరువలేము అంటూ భిక్కనూరు ప్రభుత్వ ఉన్నత పా ఠశాల పూర్వ విద్యార్థులు కంట తడిపెట్టారు. మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శ్రీనాథ్ గుండెపోటుతో మృతి చెందడంతో పూర్వ విద్యార్థులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం పాఠశాల ఆవరణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. హెచ్‌ఎంగా శ్రీనాథ్ పాఠశాలను ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దారని తెలిపారు. ఆయన గుండెపోటుతో మృతి చెందడం ఎంతో బాధాకరమని కంటతడి పెట్టారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాజ సింహారెడ్డి, అఖిల్, జాన్ హరిచరణ్, చంద్రశేఖర్, అశ్విత్ , శ్రేయస్, అఖిల్ పాల్గొన్నారు.


