రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Sep 16 2026 3:25 AM | Updated on Sep 16 2026 3:25 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చికిత్స పొందుతూ వివాహిత.. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు స్నేహితుడి మృతికి కారణమైన యువకుడిపై కేసు యువతి అదృశ్యం

నస్రుల్లాబాద్‌: సైకిల్‌, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్‌ మండలం దుర్కి గ్రామానికి చెందిన పాషా(61) సోమవారం రాత్రి రోడ్డు గుండా సైకిల్‌పై బాన్సువాడకు వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్‌ ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పాషాను కుటుంబీకులు మొదట బాన్సువాడకు ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బైక్‌ నడుపుతున్న వాజీద్‌నగర్‌కు చెందిన కులకర్ణి వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

భిక్కనూరు: యాసిడ్‌ గాయాలకు గురైన ఓ వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై అనిల్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరుకు చెందిన దివ్యవాణి(33)కి నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన అరవింద్‌తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అత్తింట్లో తరచూ గొడవలు జరుగుతుండడంతో ఇటీవల పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఈ నెల 11న రాత్రి ఒంటరిగా బయటకు వెళ్లిన ఆమె ఆదివారం సాయంత్రం జంగంపల్లి శివారులో యాసిడ్‌ గాయాలతో ప్రత్యక్షమైంది. కుటుంబీకులు వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. మృతురాలి తండ్రి మధుసూదన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌ తెలిపారు.

నస్రుల్లాబాద్‌: మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం సోమల్గల్‌ తండాకు చెందిన అజ్మీర్‌ కిషన్‌ అనే వ్యక్తి పెట్రోల్‌ బంక్‌ సమీపంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ఇతర వాహనాలు స్పీడ్‌ గా రావడంతో కిషన్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక కాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది కిషన్‌ను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): మద్యం మత్తులో బైక్‌ నడిపి స్నేహితుడి మృతికి కారణమైన యువకుడిపై భీమ్‌గల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. భీమ్‌గల్‌ మండలం బాబాపూర్‌ గ్రామానికి చెందిన స్వరాజ్‌ అనే యువకుడు సోమవారం రాత్రి పురాణిపేటకు చెందిన తన స్నేహితుడు తీగల అక్షయ్‌(23) ఇంటికి వెళ్లి తన బైక్‌పై ఎక్కించుకొని భీమ్‌గల్‌కు వచ్చారు. అర్ధరాత్రి ఇద్దరు కలిసి బైక్‌పై బాబాపూర్‌ రోడ్‌ వైపు వెళ్లారు. స్వరాజ్‌ మద్యం సేవించిన మత్తులో బైక్‌ను అతివేగంగా నడపడంతో అదుపు తప్పింది. దీంతో బైక్‌పై వెనుక కూర్చున్న అక్షయ్‌ రోడ్డు డివైడర్‌పై పడడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద ఘటన స్థలాన్ని భీమ్‌గల్‌ సీఐ పీ సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. మృతుడి తండ్రి నర్సాగౌడ్‌ ఫిర్యాదు మేరకు స్వరాజ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.

మోపాల్‌: మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఈ నెల 10న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు.

చెరువులో పశువుల కాపరి గల్లంతు

ఇందల్వాయి: మండలంలోని మేఘ్య నాయక్‌ తండాకు చెందిన దేగవత్‌ మంగ్త్య అనే వ్యక్తి గన్నారం పెద్ద చెరువులో గల్లంతైనట్లు సర్పంచ్‌ బంతిలాల్‌ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మంగ్త్య తన కొడుకు రమేశ్‌ తో కలిసి గన్నవరం గ్రామానికి చెందిన గేదెలను మేపుతుంటాడు. ఈ క్రమంలో గేదెలను చెరువులో నుంచి మళ్లించేందుకు చెరువులోకి దిగగా ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు.

గమనించిన స్థానికులు వెంటనే గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. మంగ్త్య కోసం పోలీసులు, ఫైర్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement