నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా జడ్జిగా పని చేసి బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తి హరీషను బార్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి జీవీఎన్ భారతా లక్ష్మి హాజరై మాట్లాడారు. తన జ్యుడీషియల్ టీంలో ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పనిచేశారని, హరీష ప్రోసీజర్ ప్రకారం తన పనితీరు నిర్వహించారని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠరావు, జడ్జిలు నారాయణ, దుర్గాప్రసాద్, ఉషాకిరణ్, న్యాయ సేవ సంస్థ కార్యదర్శి నీలిమ, సీనియర్ సివిల్ జడ్జిలు అజయ్ ఉల్లమ్, చైతన్య, రెండవ అదనపు కోర్టు మెజిస్ట్రేట్ శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి సుభాష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అవుల నారాయణ, సభ్యులు ఝాన్సీరాణి, బైర గణేశ్, అదనపు జిల్లా కోర్టు పీపీలు నర్సింహారెడ్డి, దయాకర్ గౌడ్, న్యాయవాదులు టీ గంగాధర్, కాసీం, శ్రీమాన్, న్యాయవాదులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిన నియమిస్తున్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో 4 ప్రొఫెసర్, 7 అసోసియేట్ ప్రొఫెసర్, 51 అసిస్టెంట్ ప్రొఫెసర్, 15 ట్యూటర్, 6 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఈనెల 15 నుంచి ఈ నెల 19వ తేదీ వరకు పూర్తి చేసిన దరఖాస్తులను ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అందించాలన్నారు. ఈ నెల 22వ తేదీన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.


