● ముగ్గురు నిందితులపై కేసు నమోదు
నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం చౌరస్తా ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, నార్త్ అటవీ రేంజ్ అధికారి సంజయ్ గౌడ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న టేకు కలప విలువ రూ.73,210 గా నిర్ధారించారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకొని, జిల్లాకు చెందిన అబ్రహర్ అలీఖాన్, మహ్మద్ ముక్తర్, సద్దాం షేక్‌లపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అటవీ సంపదను అక్రమంగా రవాణా చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అటవీ సంపద పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
మంచిప్పలో..
మోపాల్: మండలంలోని మంచిప్ప అటవీ ప్రాంతంలో కలప దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సెక్షన్ ఆఫీసర్ సాయికుమార్ తెలిపారు. శనివారం అటవీ ప్రాంతంలో చెట్లను నరికేస్తున్న సమాచారం అటవీ అధికారులకు అందింది. అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్న విషయం తెలుసుకున్న దుండగులు ఆటో, 12 కలప దుంగలను వదిలేసి పారిపోయారు. సెక్షన్ ఆఫీసర్ సాయికుమార్, బీట్ ఆఫీ సర్ సురేశ్ కుమార్ వాటిని స్వాధీనం చేసుకొని సౌ త్ రేంజ్ ఎఫ్‌ఆర్‌వో కార్యాలయానికి తరలించారు.
చెట్లను నరికిన ఒకరిపై కేసు
ఇందల్వాయి: ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని మెఘ్యానాయక్ తండాను ఆనుకొని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌లో చెట్లను నరికిన గన్నారం గ్రామానికి చెందిన కుంట లక్పతి రెడ్డిపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఆర్‌వో రవి మోహన్ భట్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు శివాలయం వద్ద ఉన్న లక్పతి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా ఐదు టేకు, మూడు చీనంగా దుంగలను స్వాధీనం చేసుకొని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. సెక్షన్ అధికారి ప్రభాకర్, బీట్ అధికారి నగేశ్‌ను ఎఫ్‌ఆర్‌వో అభినందించారు.
18 వేల జరిమానా
మాక్లూర్: మండలంలోని అడివి మామిడిపల్లి శివారులో అనుమతి లేకుండా చెట్టును నరికిన అదే గ్రా మానికి చెందిన బొనేకర్ శ్రీనివాస్‌కు రూ. 18 వేల జరిమానా విధించినట్టు ఆర్మూర్ ఫారెస్టు రేంజ్ అధికారి అరుణ్‌కుమార్ శనివారం తెలిపారు. అను మతి లేకుండా చెట్లను నరికితే చట్టపరమైన చర్యలతోపాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
భీమ్‌గల్‌లో రూ.21 వేలు..
కమ్మర్‌పల్లి: భీమ్‌గల్ మండలం పురానీపేట్‌లో అనుమతి లేకుండా టేకు చెట్లను నరికిన నవీన్‌కుమార్ అనే వ్యక్తికి రూ. 21 వేలు జరిమానా విధించినట్లు కమ్మర్‌పల్లి ఎఫ్‌ఆర్‌వో కె. అనిత శనివారం తెలిపారు. సొంత స్థలమైనా, పబ్లిక్ స్థలాల్లోనైనా అనుమతి లేకుండా చెట్లను నరికితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.


