● మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి
నందిపేట్(ఆర్మూర్): యూత్ డిక్లరేషన్ పేరుతో ఎన్నికలకు ముందు ఓట్ల కోసం కాంగ్రెస్ ఆడిన అతి పెద్ద డ్రామా అని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం నందిపేట మండల కేంద్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో వివేకానంద చౌరస్తా నుంచి నంది విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చేపట్టిన ధర్నాలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి యువత, నిరుద్యోగులు, విద్యార్థుల కడుపు కొట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల చీటింగ్‌పై యువత ఫైటింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.10వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఆరోపించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ వంచించిందన్నారు. ఉద్యోగాలిచ్చిన ఘనత కేసీఆర్‌ది అని కొనియాడారు. కాగా, బీఆర్‌ఎస్ చేపట్టిన ర్యాలీలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొనకుండా పోలీసులు కళాశాల గేట్‌కు తాళాలు వేయడంపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి గేట్‌ను తెరిపించి విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, సీనియర్ నాయకులు రాజారాం యాదవ్, యువజన విభాగం నాయకులు అభిలాష్, మచ్చర్ల సాగర్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.


