నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండల కేంద్రంలో ఓ పిచ్చికుక్క మంగళవారం స్వైరవిహారం చేసింది. వేకువజామున ఇంటి వాకిలిని శుభ్రం చేస్తున్న వృద్ధురాలు సక్కుబాయిపై దాడి చేసింది. తలకు, ముఖానికి బలమైన గాయలయ్యాయి. అలాగే మధ్యాహ్నం వేళ రాంమందిర్ కాలనీలో మరో ఇద్దరిపై, పశువులపై సైతం పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చింది. గాయపడ్డ వారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
బోధన్‌రూరల్: మండలంలోని కొప్పర్గ గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. దాడిలో 13 మందిని అరెస్టు చేయగా వారి నుంచి రూ.44,330 నగదు, 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మోపాల్: మండల శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను దుండగులు ధ్వంసం చేసి కాపర్ వైర్‌ను మంగళవారం ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పంచనామ చేశారు. లైన్ ఇన్‌స్పెక్టర్ నజీరుద్దీన్, లైన్‌మన్ మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.


