● మద్నూర్‌లో ఇద్దరు నిందితుల అరెస్ట్
మద్నూర్ : వ్యసనాలకు బానిసైన ఇద్దరు వ్యక్తులు బైక్ దొంగలుగా మారారు. మద్నూర్ శివారులో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. నిందితుల వివరాలను ఎస్సై మోహన్‌రెడ్డి మంగళవారం స్థానిక పీఎస్‌లో వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన జాదవ్ అజయ్, షేక్ అయాన్ జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడుతున్నారు. మహారాష్ట్రలో వీరిపై కేసులు ఉండటంతో తెలంగాణలోని మద్నూర్, డోంగ్లి మండలాల్లో బైక్ చోరీలు చేద్దామని ఇక్కడకు వచ్చారు. వీరు గత నెల 28న డోంగ్లి మండల కేంద్రంలో, మద్నూర్ మండలంలోని హండేకెల్లూర్‌లో రెండు బైక్‌లను దొంగిలించారు. వీటిని పిట్లం, బిచ్కుంద ప్రాంతాల్లో విక్రయిద్దామని తీసుకెళ్తుండగా మద్నూర్ శివారులో పోలీసులు గమనించి పట్టుకున్నారు. విచారణలో నిందితులు చేసిన నేరాలను ఒప్పుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోలీసు సిబ్బంది విఠల్, శ్రావణ్, సంతోష్ ఉన్నారు.


