● బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
● కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ అర్బన్: పుట్టబోయేది ఆడ శిశువు అని నిర్ధారణ చేసి, గర్భవిచ్చిత్తికి పాల్పడడం క్షమించరాని నేరమని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంట ర్లపై ఉక్కుపాదం మోపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం గర్భస్థపూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లాస్థాయి సలహా సంఘ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కమిటీ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసంతప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడ కూడా లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు జరుగకుండా గట్టి నిఘా పెట్టాలన్నారు. పక్కాగా నిబంధనలు పాటించే స్కానింగ్ కేంద్రాలకే లైసెన్సులు రెన్యూవల్ చేయాలని ఆదేశించారు. పిసిపి ఎన్‌డిటి, ఎంటిపీ చట్టాలను ఉల్లంఘించడం వల్ల సమాజంలో సీ్త్ర, పురుషుల నిష్పత్తి గణనీయంగా తగ్గిపోతున్నదన్నారు. పుట్టబోయే శిశువు ఆడ, మగ ఎవరైనా సరే, అందరూ సమానమే అని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూ ర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, కమిటీ సభ్యులు సిద్దయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.


