సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యాక్ట్ 1961 ప్రకారం రవాణా రంగంలో కార్మికులు రోజుకు 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది. వారానికి మొత్తంగా 54 పనిగంటలు దాటొ ద్దని చట్టాలు చెబుతున్నాయి. కానీ ఆర్టీసీలో ఈ చట్టాలు యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతున్నాయి. యాజమాన్యం కార్మికులతో రోజుకు 12 గంటల నుంచి 16 గంటలు పనిచేయిస్తోంది. దీంతో కార్మికులు తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రధానంగా డ్రైవర్లు వెన్ను సమస్యలతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పోనీ అదనంగా చేసిన పనికి నిబంధనల ప్రకారం స్పెషల్ ఆఫ్‌లు ఇస్తున్నారా అంటే అదీ లేదు.. ఓవర్ టైం డ్యూటీలుగా పరిగణిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు.
పెరిగిన రద్దీతో ఇబ్బంది..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆరు డిపోల పరిధిలో మొత్తం షెడ్యూల్స్ 6 వందలపైచిలుకు ఉన్నాయి. ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి ఈ షెడ్యూల్ ప్రకారం తిరుగుతాయి. రాజధాని బస్సులు 25, లహరీ బస్సులు 8, సూపర్ లగ్జరీ బస్సులు 88, డీలక్స్ బస్సులు 59, ఎక్స్‌ప్రెస్‌లు 194, పల్లెవెలుగు బస్సులు 290 తిరుగుతున్నాయి. వాస్తవంగా యాజమాన్యం రూట్ సర్వే చేసి షెడ్యూల్ నిర్ణయించాలి. దీనికి ఆయా రూట్లలో రోడ్ల పరిస్థితి, ప్రయాణికుల రద్దీని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చాక బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఓవైపు రోడ్డు సరిగా లేక.. మరోవైపు బస్సు నిండా ప్రయాణికులతో అడుగడుగునా ఆపాల్సిన పరిస్థితుల్లో నిర్ణయించిన సమయం సరిపోవడం లేదు. జేబీఎస్‌కు వెళ్లే బస్సులు ట్రాఫిక్ సమస్యతో నిర్ణీత సమయంలో చేరుకునే పరిస్థితి ఉండడం లేదు. దీంతో రెస్ట్ లేకుండా పనిచేస్తున్న కార్మికులు తీవ్ర అలసటకు గురవుతున్నారు.
అదనపు పనికి ఇచ్చేది అరకొరే...
ఆర్టీసీలో రోజుకు ఎనిమిది గంటల డ్యూటీ అన్నది పేరుకు మాత్రమే.. ప్రతి కార్మికుడు 12 గంటల నుంచి 16 గంటల వరకు పని చేస్తున్నారు. విరామం లేకుండా అదనంగా 4 గంటలు పనిచేసినపుడు స్పెషల్ ఆఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాటిని ఓవర్ టైం డ్యూటీలుగా మార్చి (సింగిల్‌కు) శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. కార్మికుల నిజ వేతనాలు సరాసరిగా రోజుకు రూ.1,500 నుంచి రూ.3 వేల వరకు ఉండగా.. నిబంధనల ప్రకారం డబుల్ డ్యూటీ చేసిన డ్రైవర్, కండక్టర్లకు రెట్టింపు వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రూ.3 వేల నుంచి రూ.6 వేల దాకా చెల్లించాలి. కానీ కండక్టర్‌కు రూ.710, డ్రైవర్‌కు రూ.వెయ్యి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అడ్డా కూలీ ఉదయం 9 గంటలకు పనికి వెళ్లి సాయంత్రం 5 గంటలకు తిరిగి వెళతాడని, మధ్యలో తినడానికి, బీడీకాడీకి, కాలకృత్యాలంటూ కనీసం గంంట సమయం ఖాళీగా ఉంటారని, తమకు మాత్రం ఆ అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ వింత లెక్కలు..
కార్మికుడు యజమాని ఆధీనంలో ఉన్న కాలా న్ని పనిగంటలుగా లెక్కిస్తారు. కానీ ఆర్టీసీలో మాత్రం డ్రైవర్ సీటు మీద కూర్చున్న కాలాన్నే (స్టీరింగ్ అవర్స్) పరిగణనలోకి తీసుకుని మి గతా సమయాన్ని రెస్ట్‌గా (డ్యూటీ నుంచి మినహాయించి) చూపుతున్నారు. ట్రిప్పు, ట్రిప్పున కు మధ్య ఇచ్చే విరామ సమయాన్ని డ్యూటీ కింద లెక్కించడం లేదు.
స్టీరింగ్ అవర్స్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న యాజమాన్యం
విరామ సమయాన్ని డ్యూటీ కింద
లెక్కించని సంస్థ
అదనపు పనికి స్పెషల్ ఆఫ్‌ల స్థానంలో ఓటీ డ్యూటీలు..
పనిచేయని కార్మిక నిబంధనలు
అడ్డాకూలీలే నయమంటున్న కార్మికులు
కామారెడ్డి నుంచి బాన్సువాడకు నడిచే ఆర్డినరీ బస్సు మూడు ట్రిప్పులు చేయాల్సి ఉంటుంది. ఒక్కో ట్రిప్పునకు తక్కువలో తక్కువ 4 గంటల సమయం పడుతుంది. కానీ ఆర్టీసీ అధికారులు 3.30 గంటలకు కుదించారు. ఒక్కో ట్రిప్పునకు గంట చొప్పున రెస్ట్ పేరుతో సమయం ఇచ్చి 15 గంటల పాటు తమ ఆధీనంలో ఉంచుకుని పని చేయించుకుంటారు. 15 గంటలు డ్యూటీలోనే ఉన్నప్పటికీ ఓవర్ టైం మాత్రం 3 గంటలు ఇస్తున్నారు.
ఓటీ, టిమ్‌లతో పనిభారం..
ఖర్చు తగ్గించుకునే లక్ష్యంతో యాజమాన్యం సి బ్బందిని తగ్గిస్తూ వస్తోంది. దీంతో ఉన్న కార్మికులపైనే పనిభారం పడుతోంది. సింగిల్ క్రూ (ఓటీ) డ్యూటీలు, టిమ్ డ్యూటీలతో కార్మికు లు ఎక్కువ శ్రమకోర్చాల్సి వస్తోంది. రీజియన్‌లో సింగిల్ క్రూ (ఓటీ) డ్యూటీలు 2 వందల పైచిలుకు ఉండగా, టిమ్ డ్యూటీలు 140 వరకు ఉ న్నాయి. టిమ్ సర్వీసుల్లో డ్రైవరే టికెట్టు ఇవ్వా ల్సి ఉంటుంది. ప్రయాణికులు చేయి ఎత్తితే బస్సు ఆపడం, వాళ్ల టికెట్టు తీసుకోవడం ద్వారా సమయం వృథా అవుతోంది. నిర్ణీత సమయానికి గమ్యస్థానం చేరడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే సింగల్ క్రూ డ్యూటీలతో అలసిపోతున్నారు.


