నవీపేట: పుష్కరాల (2027) నేపథ్యంలో యంచ గోదావరి ఒడ్డున ఘాట్ నిర్మాణానికి స్థలం ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారింది. యంచలో నూతనంగా నిర్మించే పుష్కర ఘాట్‌కు రూ.2.15 కోట్లతోపాటు రహదారి విస్తరణకు రూ.కోటి మంజూరయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ప్రతిపాదిత స్థలాన్ని సైతం పేర్కొన్నారు. అయితే కొన్నేళ్ల కిందట ఆధ్యాత్మిక గురువు గణపతి సచ్చిధానందస్వామి ఆశ్రమ ట్రస్టు ప్రతినిధులు గోదావరి నది ఒడ్డున 6 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. తాము ఘాట్ నిర్మాణానికి భూమి ఇస్తామని, తమ స్థలంలోనే నిర్మించాలని ట్రస్ట్ బాధ్యులు ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచారు. ఓ ప్రజాప్రతినిధి కు టుంబ సభ్యులు సచ్చిదానంద స్వామి భక్తులు కావడంతో ట్రస్టు సూచించిన స్థలంలోనే ఘాట్ నిర్మించాలని ఉన్నతస్థాయిలో అధికారులు చెప్పకనేచెప్పి చేతులు ఎత్తేసినట్లు సమాచారం. అయితే గ్రామస్తు లు మాత్రం ప్రభుత్వ జీవోలో పేర్కొన్న స్థలంలోనే ఘాట్ నిర్మించాలని, వేరే చోట నిర్మిస్తే ఊరుకోబోమని అంటున్నారు.
అయోమయం
పుష్కర ఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరైనా స్థల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. ఇరిగేషన్, పీఆ ర్ శాఖల అధికారులు ఉమ్మడిగా సర్వే చేసి స్థలాన్ని ప్రతిపాదించారు. కానీ స్థల ఎంపికలో ఉన్నతస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకోవడంతో స్థానిక అధికారులు అయోమయంలో పడ్డారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా గ్రామస్తులతో కలిసి మంగళవారం పుష్కర ఘాట్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ ప్రకాశ్, పీఆర్ ఎస్‌ఈ శంకర్‌రాథోడ్, డీఈఈలు బలరామ్, వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ, సర్పంచ్ బేగరి సాయిలు, ఉప సర్పంచ్ ప్రవీణ్, వీడీసీ ప్రతినిధులు రాజేశ్వర్, కొట్టాల ప్రవీణ్, విజయ్, ధర్మాజీ, సాయిలు తదితరులు ఉన్నారు.
యంచలో పుష్కరఘాట్ నిర్మాణ స్థలంపై తేల్చుకోని అధికారులు
జీవోలో పేర్కొన్న ప్రతిపాదిత స్థలంలోనే నిర్మించాలంటున్న గ్రామస్తులు
తాము భూమి ఇస్తామంటున్న గణపతి సచ్చిదానంద ఆశ్రమ నిర్వాహకులు


