నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కౌలాస్‌నాలా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో 9 వేల ఎకరాల ఆయకట్టుకు భరోసా లభించింది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎగువన సరైన వర్షాలు లేక జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అయితే ఇటీవలి కాలంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగులు పారుతూ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కౌలాస్ నాలా జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగా.. సోమవారం సాయంత్రానికి 457.55 మీటర్ల (1.129 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కౌలాస్‌నాలా నిండడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


