కామారెడ్డి రూరల్: కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిధిలోని రామారెడ్డి మండలం రంగంపేట శివారులో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకోటి జగదీష్(52)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడికి ఇంకా కాలేదు. జగదీష్ హైదరాబాద్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడు కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో ఈనెల 14న అతడు హైదరాబాద్ నుంచి సొంతూరికి వచ్చాడు. 15న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన జగదీష్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలో రంగంపేట శివారు ప్రాంతంలో రైలు కింద పడి మృతి చెందినట్లు సమాచారం అందింది. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై, సిబ్బంది వెంటనే రైలు మార్గం పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టగా, చీకటి కావడంతో ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం రైల్వే పోలీసులు మరోసారి రంగంపేట శివారు ప్రాంతంలో గాలింపు చేపట్టగా, జగదీష్ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


