బోధన్‌టౌన్(బోధన్): బోధన్ బల్దియాపై నిధులు దుర్వినియోగంతోపాటు పలు అక్రమాలపై ఆరోపణలతో పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో అధికారులు విచారణ చేపట్టి వెళ్లారు.కానీ రోజులు గడుస్తున్నా ఆరోపణలను నిర్ధారణ చేసి,చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
శ్మశాన వాటికలకు రూ.28లక్షలు..
పట్టణ ప్రగతిలో భాగంగా 2018లో 16వ వార్డులోని శ్మశాన వాటిక అభివృధ్ది కోసం రూ.8లక్షలు, 2023లో రూ.20లక్షలు మొత్తం రూ.28 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో చేపట్టిన పనుల్లో అక్రమాలు జరిగాయని లోకాయుక్తకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో జులై 28న మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ విచారణ చేశారు. అనంతరం ఆగస్టు 5న లోకాయుక్త డిప్యుటీ డైరక్టర్ జైపాల్ స్మశాన వాటికను సందర్శించి పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్మశాన వాటికలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫోటోలు, ఖర్చు చేసిన నిధులు వివరాలకు సంబంధించిన రికార్డులను వెంట తీసుకెళ్లారు.
నిధుల దుర్వినియోగంపై..
బల్దియాలోని వాటర్ వర్క్స్‌లో నిధుల దుర్వినియోగంతోపాటు పట్టణంలో ఏర్పాటు చేసిన ట్రీప్లాంట్స్, వాటర్ వర్క్స్ విభాగానికి సంబంధించిన పాత ఇనుపసామగ్రి, విద్యుత్ దీపాలు, కొనుగోలు చేసిన మోటార్లతోపాటు మరికొన్ని అంశాల్లో అవినీతి జరిగిందని పలువురు ఆరోపించారు. ఈక్రమంలో ఇంజినీరింగ్ శాఖ అధికారులపై సీడీఎంఏకు ఫిర్యాదు రాగా వారు విచారణ చేపట్టాలని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్‌కు సూచించింది. దీంతో రీజినల్ డైరెక్టర్ 2025 నవంబర్ 1న విచారణకు వస్తున్నట్లు కమిషనర్‌కు, వాటర్ వర్క్స్‌ను పర్యవేక్షణ చేస్తున్న ఇంజినీర్లకు, ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 1న బల్దియా కార్యాలయానికి వచ్చిన ఆర్‌డీ నోటీసులు అందిన ఇంజినీర్లను వాటర్ వర్క్స్ పర్యవేక్షణ అధికారులను విచారణ చేశారు. ఫిర్యాదులు వచ్చిన అంశాల రికార్డులను స్వాధీనం చేసుకొని విచారణ చేశారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. బల్దియా పరిపాలన అంశాలపై, నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు విచారణ చేపట్టారే తప్ప నిజనిర్ధాఽరణ చేసి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని పట్టణ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కుళాయి బిల్లు చెల్లించినా..?
పట్టణ ప్రజలకు కుళాయి బిల్లు చెల్లింపునకు సంబంధించిన రసీదులు ఆన్‌లైన్ నమోదు చేసినా బిల్లు చెల్లించలేదని చూపించడంతో అయోమయానికి గురైన చెల్లింపుదారులు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. 2017 నుంచి చెల్లించిన కుళాయి బిల్లుల రసీదులు ఆన్‌లైన్‌లో నమోదు చేసినా 8వేల మందికి సంబంధించిన బిల్లులు చెల్లించలేదని, దీనిపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో గడిచిన 6 నెలల క్రితం గతంలో ఇక్కడ అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన అంకిత్ విచారణ చేపట్టి రికార్డులు సైతం పరిశీలించారు.
బోధన్ బల్దియాలో అవినీతి,
అక్రమాలపై ఫిర్యాదులు
విచారణ చేపట్టి వెళ్లిన అధికారులు
నిర్ధారణ చేసి, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం


