● కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన
యూరియా యాప్‌తో ఇబ్బందులు
● ఎన్నో సందేహాలు, మరెన్నో అవాంతరాలు
ఇందల్వాయి: రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, ఎరువులు వినియోగం, నిల్వలు, పంపిణీపై పర్యవేక్షణ కోసం తీసుకొచ్చిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్(ఎఫ్‌ఎఫ్‌ఎస్) రైతులకు కొత్త తిప్పలు తెచ్చి పెడుతోంది. ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌తో అపసోపాలు పడ్డ రైతులకు ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన ఈ యాప్ మరింత గందరగోళానికి గురిచేస్తోంది. యాప్‌లో యూరియా ఎలా బుక్ చేయాలో తెలియక చదువుకున్న రైతులతో పాటు నిరక్షరాస్యులైన రైతులు అయోమయానికి గురవుతున్నారు.
అంతా గందరగోళం..
నూతన యూరియా బుకింగ్ అప్లికేషన్‌లో పూర్తి స్థాయిలో లాగిన్ అయి యూరియా బుకింగ్ ఆప్షన్‌కి వెళ్లే సరికి లాగిన్‌లు, ఓటీపీలు, వెరిఫికేషన్‌లు, సబ్ కేటగిరిలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయి. సరిగా వివరాలు పొందుపర్చకపోతే ముందుకు వెళ్లడం సాధ్యపడటం లేదు. ఇవన్నీ సరిచూసుకొని చివరి దశకు చేరుకునే సరికి అందుబాటులో ఉన్న డీలర్ వద్ద యూరియా కోటా అయిపోతోంది. మళ్లీ వచ్చే సరికి పొలానికి యూరియా అందించే సమయం ఆలస్యమవుతోందని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదుకాని వందల ఎకరాలు
ధరణి నుంచి భూ భారతి వరకు ఒక్కో గ్రామంలో రైతులకు సంబంధించిన వందల ఎకరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. కొందరివి వేరే రైతుల పేరు మీద నమోదయ్యాయి. ఇలాంటి వారికి ఈ నూతన యూరియా బుకింగ్ ఆప్‌లో యూరియా పొందే అవకాశం ఇప్పుడు లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పాస్‌బుక్ ఉండి అప్లికేషన్‌లో చూపించని సర్వే నంబర్లను మొదట నమోదు చేసుకుంటే మండల వ్యవసాయ అధికారి లాగిన్‌లోకి ఆ వివరాలు వెళ్తాయని అక్కడ ఏవో అనుమతిస్తే రైతు లాగిన్‌లోకి వస్తాయని అధికారులు తెలిపారు.
సకాలంలో అందక..
అందుబాటులో ఉన్న డీలర్ల వద్ద అవసరమైన యూరియా సకాలంలో దొరకక రైతులు దూర ప్రాంతాల్లో ఉన్న డీలర్ల వద్ద యూరియా బుక్ చేసుకుంటున్నారు. దీంతో వారు అక్కడికి వెళ్లి యూరి యా ఇంటికి తీసుకొచ్చే క్రమంలో సమయంతో పా టు రవాణా చార్జీలు అధికమవుతున్నాయి. దగర్లోని డీలర్ల వద్ద యూరియా ఉన్నా యూరియాని ఆన్‌లైన్‌లో ఉంచిన ఐదు, పది నిమిషాల్లోనే అయిపోతోందని, దీంతో చదువురాని రైతులు, మహిళ రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
సాగు చేయని వారికి..
భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అసలు భూమే లేని వందల ఎకరాలకు, సర్వే నంబర్లలో విస్తీర్ణం పెంచి సాగు చేయని వందల మంది రైతులకు వేల ఎకరాలను రెవెన్యు అధికారులు పట్టాలు మంజూరు చేశారు. ఇప్పుడు వారందరు ఆ పట్టాలతో వారి స్నేహితులకు, బంధువులకు యూరియా బుక్ చేసి ఇస్తున్నారు. దీంతో భూమి ఉండి పట్టా లేని అర్హులైన రైతులకు యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఎలా ముందుకెళ్లాలో జిల్లా స్థాయి అధికారులు కూడా సరైన వివరణ ఇవ్వలేకపోవడం గమనార్హం.


