సమస్యలు పరిష్కరించాలి..
మాక్లూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ (జీఎన్‌ఎం) విద్యార్థులకు పాఠాలు బోధించేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో తెలియక నర్సింగ్ కోర్సు చదువుతున్న విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయమై ఇటీవల భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సిద్దుల నాగరాజు, జిల్లా కమిటీ సభ్యుడు మహేష్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలలో నెలకొన్న సమస్యలపై ప్రిన్సిపాల్‌ను ‘సాక్షి’ సంప్రదించగా, ఆయన అనుమతించలేదు. ఈ సంవత్సరం జనవరి నుంచే బోధన సిబ్బంది లేరని సమాచారం. విద్యార్థులకు అత్యంత ముఖ్యమైన థియరీ సబ్జెక్ట్‌తోపాటు ప్రాక్టికల్ విద్య కూడ కొనసాగటం లేదని తెలుస్తోంది. గత్యంతరం లేక బీఎస్సీ పైనల్ ఇయర్ విద్యార్థులతో బోధన సాగిస్తున్నట్లు విద్యార్థి సంఘాల సర్వేలో వెల్లడైంది. ప్రాక్టికల్స్ కోసం విద్యార్థులను జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాడానికి బస్సుకూడ లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నర్సింగ్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మాక్లూర్ నర్సింగ్ స్కూల్లో విద్యార్థులు దీర్ఘకాలికంగా ఎదుర్కోంటున్న సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలి. ఇటీవల స్కూల్‌ను సందర్శించి, సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అరకోరగా కొన్ని సమస్యలను పరిష్కరించినట్టు తెలిసింది. సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించకుంటే విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తాం.
–మహేష్, యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు


