ఖలీల్‌వాడి: నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల (బాయ్స్)లో గురువారం నిర్వహించిన జాబ్ మేళాలో 80 మంది ఎంపికై నట్లు జిల్లా ఐటీఐ కన్వీనర్ జి. యాదగిరి తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ జాబ్ మేళాను నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి 24 ప్రముఖ కంపెనీలు హాజరయ్యాయని, వివిధ ట్రేడ్లకు చెందిన మొత్తం 306 మంది అభ్యర్థులు హాజరై ఉద్యోగాలు, అప్రెంటిస్ షిప్ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు పాల్గొన్నారు. కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు, పనితీరు తదితర అంశాలను పరిశీలించి ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఎంపిక ప్రక్రియ అనంతరం 150 మంది అభ్యర్థులు అప్రెంటిస్ షిప్ కు ఎంపిక కాగా, మరో 80 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికై న అభ్యర్థుల్లో 46 మందికి జాబ్ మేళా వేదిక పైనే కంపెనీల ప్రతినిధులు ఆఫర్ లెటర్లను అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి ఐటీఐ ప్రిన్సిపాళ్లు, అభ్యర్థులు పాల్గొన్నారు.


