సర్పంచ్‌ భర్తపై విచారణ | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ భర్తపై విచారణ

Aug 14 2026 8:02 AM | Updated on Aug 14 2026 8:02 AM

సర్పంచ్‌ భర్తపై విచారణ మొక్కలు నాటి సంరక్షించాలి పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తాం మద్దుల్‌ తండాలో గ్రామసభ నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకే ‘ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్లు’

డిచ్‌పల్లి: మండలంలోని సుద్దులం గ్రామ సర్పంచ్‌ తీనేటి హేమలత భర్త లక్ష్మణ్‌రెడ్డి పంచాయతీ పాలనలో జోక్యం చేసుకుంటున్నారని ఉప సర్పంచ్‌ చెవిటి నరేశ్‌ జిల్లా పంచాయతీ అధికారికి ఇటీవల ఫిర్యాదు చేశారు. డీపీవో ఆదేశాల మేరకు గురువారం నిజామాబాద్‌ డీఎల్‌పీవో శ్రీనివాస్‌ సుద్దులం గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, పంచాయతీ పాలకవర్గం సభ్యులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. విచారణ నివేదికను డీపీవోకు అందజేస్తానని డీఎల్‌పీవో తెలిపారు.

ధర్పల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్‌ మాలావత్‌ సరస్వతి అన్నారు. మండలంలోని గుడి తండా గ్రామపంచాయతీ పరిధిలో వన మహోత్సవంలో భాగంగా సర్పంచ్‌ అధికారులతో కలిసి మొక్కలను గురువారం నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సరస్వతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటింటికి మొక్కలు నా టాలన్నారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ఉప సర్పంచ్‌ మోహన్‌ నాయక్‌, కానిస్టేబులు సునీల్‌, నరేష్‌, నాయకులు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందల్వాయి: సిర్నాపల్లిలోని జానకీబాయి గడీని, చెరువు వాటర్‌ ఫాల్స్‌ని జిల్లా పర్యాటక శాఖ అధికారి పవన్‌ కుమార్‌ గురువారం సందర్శించారు. ఈ సంధర్భంగా ఆయన వాటర్‌ ఫాల్స్‌ వద్ద పర్యాటకులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సిర్నాపల్లిలోని చారిత్రాత్మక ప్రదేశాలను, ప్రకృతి అందాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ కృషి చేస్తుందని అన్నారు. వాటర్‌ ఫాల్స్‌ వద్ద పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్పంచ్‌ అనిత, వీడీసీ సభ్యులు ఉన్నారు.

ధర్పల్లి: మద్దుల్‌ తండాలో సర్పంచ్‌ అరుణ అధ్యక్షతన గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో జలసిరిపై ప్రజలకు అధికారులు వివరించారు. ఎల్‌నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలన్నారు. వ్యర్ధాల నిర్వహణ నిబంధనలు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై చర్చించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంపీవో శ్రీధర్‌, అధికారులు పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌: విద్యుత్‌ వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరాలో భాగంగా నిజామాబాద్‌ సర్కిల్‌ పరిధిలో ఇప్పటి వరకు 43 ఇంటర్‌ లింక్‌ లైన్లు ఏర్పాటు చేశామని ఎన్‌పీడీసీఎల్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ పీవీ రాజేశ్వర్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 33కేవీ ఇంటర్‌ లింక్‌ లైన్‌ వ్యవస్థ అనగా.. ఒక 33/11కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి మరొక 33/ 11కేవీ సబ్‌స్టేషన్‌కు, అలాగే ఒక 33/11కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి మరో 132/33 కేవీ సబ్‌స్టేషన్‌కు, 33కేవీ లైన్‌ నుంచి మరో 33 కేవీ లైన్‌కు మధ్య అనుసంధానంగా ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ విద్యుత్‌ సరఫరా అందజేయడం ఇంటర్‌ లింక్‌ లైన్ల ముఖ్య ఉద్దేశమన్నారు. నిజామాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని 218 33/11కేవీ సబ్‌ స్టేషన్లలో 97 33కేవీ లైన్లలో ఇంటర్‌ లింకింగ్‌ వ్యవస్థను చేపట్టినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement