ఖలీల్ వాడి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులకు ఓరియంటేషన్ శిక్షణా తరగతులతో వృత్తి నైపుణ్యం పెరుగుతోందని, దీంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి(డీఐఈవో) తిరుమలపుడి రవికుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కోటగల్లీ బాలికల జూనియర్ కాలేజీలో శిక్షణ తరగతులను డీఐఈవో పరిశీలించారు. అధ్యాపకులకు రెండో స్పెల్‌లో కామర్స్, ఫిజిక్స్, హిస్టరీ, జువాలజీ సబ్జెక్ట్ శిక్షణ ముగింపు సందర్భంగా సభకు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గంధం బుద్దిరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అధ్యాపకుడు విద్యార్థులను భావితరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి విద్యార్థిపైన వ్యక్తిగత శ్రద్ధ వహిస్తూ విద్యా బోధన చేయాలని సూచించారు. జిల్లా ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు చిన్నయ్య, అబ్జర్వర్ ధర్మపాల్, జిల్లా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు నర్సయ్య తదిరులు పాల్గొన్నారు.


