నిజాంసాగర్ : ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 1.15 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. జీరో డిస్ట్రీబ్యూటరీ నుంచి అలీసాగర్ రిజర్వాయర్ 49 డిస్ట్రీబ్యూటరీ వరకు అనధికారికంగా 1.5 లక్షల ఎకరాల వరకు ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటితో పంటలు గట్టెక్కుతున్నాయి. అయితే, ఎల్‌నినో ప్రభావంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసే ప్రసక్తి లేదని అధికారులు, ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయినా ఆయకట్టు ప్రాంత రైతులు వరుణుడిపై భారంతో ఆయకట్టు కింద పంటలను సాగు చేశారు. వరినాట్లు పూర్తవుతున్న తరు ణంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఆయకట్టు పంటలకు భరోసా కలిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు వరద నీటి ప్రవా హం నెలకొన్నాయి. చెరువులు, కుంటలతోపాటు ప్రధాన జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి.
ఆదుకున్న పోచారం, ఘనపురం ఆనకట్ట
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తడంతో జిల్లాలోని పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. మెదక్ జిల్లాలోని ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతుండటంతో మంజీర నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. పోచారం, ఘనపురం ఆనకట్ట ద్వారా వరద నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో ప్రా జెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత నెలాఖరు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 5 టీఎంసీల మేర వరద వచ్చి చేరింది. వరద నీటి చేరికతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంత రైతులకు ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయనే భరోసా ఏర్పడింది.
నీటి విడుదలకు తీర్మానం
ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 11.182 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలకు మూడు విడతల్లో 4 టీఎంసీల నీటి విడుదలకు డీఐబీ సమావేశంలో తీర్మానం చేశారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా నీటిపారుదల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో చేసిన తీర్మాన పత్రాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఒకటి, రెండు విడుతల్లో 1.2 టీఎంసీల చొప్పున మూడో విడుతలో 1.6 టీఎంసీల మేర నీటి విడుదలకు ప్రతిపాదించినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. అయితే, దీనిపై ఈ నెలాఖరున హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కీవం) సమావేశంలో నిర్ణయం వెలువడనున్నది.
ఖరీఫ్‌కు ‘సాగర్’ భరోసా
కరుణించిన వరుణుడు
ఖరీఫ్ పంటల సాగుకు ఢోకా లేదు
ఆయకట్టుకు మూడు విడుతల్లో
4 టీఎంసీల నీరు


