నిజామాబాద్ అర్బన్: ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు తక్కువ నీటి అవసరంతో ఎక్కువ దిగుబడి వచ్చే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వానాకాలం సాగు, వన మహోత్సవం, పంట కుంటలు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఆరుతడి పంటలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు. వన మహోత్సవంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలకు మొక్కలు నాటేందుకు లక్ష్యాలను నిర్దేశించామని, నాటిన ప్రతి మొక్కను తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేసి, వాటి మనుగడ శాతాన్ని నిరంతరం నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సమగ్ర వ్యవసాయ క్షేత్ర చెరువుల పథకం పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఈ నెల 15 నాటికి అన్ని పనులను ప్రారంభించి పూర్తిస్థాయిలో అమ లు చేయాలని ఆదేశించారు. ‘ఒకే చెరువు – ఆరు రకాల జీవనోపాధులు‘ అనే భావనతో నీటిపారుద ల, చేపల పెంపకం, పాడి పరిశ్రమ, కూరగాయల సాగు, పశుగ్రాసం అభివృద్ధి, సేంద్రియ ఎరువుల తయారీ వంటి కార్యక్రమాల ద్వారా మహిళా రైతు ల ఆదాయాన్ని పెంచేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పౌర సరఫ రాల వ్యవస్థను మరింత పారదర్శకంగా, భద్రతాయుతంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతోన్న స్మార్ట్ రేషన్ కార్డులను త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. డిజిటల్ సంతకం, హోలోగ్రామ్, వాటర్‌మార్క్, ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్, యూవీ లోగో తదితర అత్యాధునిక భద్రతా ఫీచర్లతో స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించినట్లు పేర్కొన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్ డీఆర్డీవో సాయన్న, డీఏవో వీరాస్వామి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వన మహోత్సవం లక్ష్యాలను
పూర్తిచేయాలి
త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులను
పంపిణీ చేస్తాం
వీసీలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి


