● డీఎంహెచ్‌వో రాజశ్రీ
సుభాష్‌నగర్ : జిల్లాలో మాతృమరణాలు తగ్గించేలా ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఎంసీహెచ్ సూపర్‌వైజర్లు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. గర్భిణికి ఎత్తు, బరువు, బీపీ, హెచ్ బీ, రక్తహీనత, తదితర పరీక్షలతోపాటు హైపర్ టెన్షన్, ప్లేట్లెట్ల పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. సాధారణ ప్రసవాలు అయ్యే విధంగా వారికి సహకరించాలని సూచించారు. ఏ ఒక్క మాతృమరణం జరగకుండా అన్ని విధాల కృషి చేయాలని, అనివార్య కారణాల వల్ల ఎక్కడైనా మాతృ మరణం సంభవిస్తే పూర్తి సమాచారాన్ని ఫార్మాట్‌లో పొందుపర్చాలని కోరారు. సమీక్షలో మాతృమరణాలు జరిగిన మాలపల్లి, సిరికొండ, గౌతమ్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితోపాటు డిప్యూటీ డీఎంహెచ్‌వోలు సికందర్ నాయక్, ప్రొఫెసర్ డాక్టర్ ఉమ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రోగ్రాం అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను జూమ్ ద్వారా డీఎంహెచ్‌వో రాజశ్రీ తన చాంబర్‌లో సమీక్షించారు. మొత్తం జనాభాలో 30ఏళ్లపైబడిన వారు 52శాతం ఉంటారని, వారికి హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో సగటున 60 ఓపీ ఉండేలా చూడాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమ సేవలు ప్రతి గ్రామంలో అర్హులకు అందేలా కృషి చేయాలన్నారు. ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ శిఖర, డాక్టర్ వెంకటేశ్, డాక్టర్ శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.


