● భీమ్‌గల్‌లో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
● వారం రోజులపాటు అధిక ఎండలు
నిజామాబాద్‌అర్బన్ / ఆర్మూర్‌టౌన్: ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో జనం బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందులో భాగంగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, నిజామాబాద్ జిల్లాలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
పిల్లలు, వృద్ధులూ జాగ్రత్త..
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే వారం రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. అయితే, ప్రధానంగా పసిపిల్లలు ఎండకు తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నారులు వడదెబ్బకు గురైతే జ్వరం, దద్దుర్లు, వాంతులు, విరోచనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృద్ధులపైనా ఎండ తీవ్రత ప్రమాదకరంగా ఉంటుందని, రైతులు, కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
రోజురోజుకూ..
జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణంగా 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా శనివారం జిల్లాలోని భీమ్‌గల్ మండలంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజు 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భీంగల్, బాల్కొండ, మాక్లూర్, నందిపేట్, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్ ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
వడదెబ్బ తగిలితే ఆస్పత్రికి వెళ్లాలి..
ప్రజలు ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో వడదెబ్బ తగలకుండా గొడుగు, తలకు టవాల్ కట్టుకోవాలి. ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 5 గంటల తర్వాత పనులు చేసుకోవాలి. జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ తగలకుండా ఉండొచ్చు. వడదెబ్బ తగిలితే వెంటనే ఏరియా ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలి. – ప్రమీదరెడ్డి,
ఆర్మూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్
ముందస్తు జాగ్రత్త మేలు
ఉష్ణోగ్రతలు అధికమవుతు న్న నేపథ్యంలో ప్రజలు తరచూ నీరు తీసుకోవాలి. అధిక ఎండ ఉన్న సమయంలో బయటికి వెళ్లొ ద్దు. వృద్ధులు, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉదయం 11 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాత పనులు చేసుకోవాలి. – డాక్టర్ జలగం తిరుపతిరావ్,
అసోసియేట్ ప్రొఫెసర్ ప్రభుత్వ వైద్య కళాశాల


