● బహిరంగ చర్చకు బీజేపీ,
కాంగ్రెస్ నేతల సవాల్
● నిర్ణీత స్థలానికి వచ్చిన దినేశ్ కులాచారి
● వాడిలో ఉద్రిక్తత
ధర్పల్లి: వరదలు, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించడంపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, బీజేపీ జిల్లా అధ్యక్షుడి సవాళ్లు ఉద్రిక్తతకు దారితీశాయి. సోషల్ మీడియా వేదికగా శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి గతంలో వరదలు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎంత పరిహారం ఇచ్చారో, ఎంతమంది రైతులను ఆదుకున్నారో బహిరంగ చర్చకు ధర్పల్లి మండలం వాడి గ్రామంలోని పెద్దమ్మ గుడి వద్దకు రావాలంటూ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సవాల్ విసిరారు. దీంతో కాంగ్రెస్ నాయకులు సైతం దినేశ్ కులాచారి చేసిన సవాలుకు ప్రతిసవాల్ విసురుతూ తాము చర్చకు సిద్ధమంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాడి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ భిక్షపతి ఆధ్వర్యంలో శనివారం పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. ఉదయం ధర్పల్లికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అయితే, దినేశ్ కులాచారి చెప్పినట్లే శనివారం ఉదయం 11 గంటల సమయానికి వాడి గ్రామంలోని పెద్దమ్మ ఆలయానికి చేరుకున్నారు. పోలీసులు అయన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం దినేశ్‌ను అరెస్టు చేసి మోపాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో దినేశ్ కులాచారి మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై నిలదీస్తే తమ నాయకులు, కార్యకర్తలను దౌర్జన్యంగా అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు. గతంలో కామారెడ్డిలో వరదలతో నష్టం వాటిల్లితే బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రజలకు పరిహారం ఇప్పించాడని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎమ్మెల్యే భూపతిరెడ్డి నష్టపరిహారం ఎందుకు ఇప్పించడం లేదని ప్రశ్నించారు. పరిహారం ఎవరికీ ఇప్పించారో ప్రజలకు తెలియాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు రూ.50 వేల పరిహారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


