ధర ఇంకా పెరగాలి
● పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నిలిచిన ఎగుమతులు.. పడిపోయిన ధర
● యుద్ధ విరామంతో పుంజుకున్న
పసుపు మార్కెట్
మోర్తాడ్(బాల్కొండ): పశ్చిమాసియాలో యుద్ధపరిస్థితులు శాంతిస్తుండడంతో పసుపు సాగు చేసిన రైతులకు ఊరట లభించింది. రెండు, మూడు వారాలపాటు పడిపోయిన పసుపు ధరలు క్రమక్రమంగా పెరుగుతుండటంతో రైతులకు కొంత లాభం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ మార్కెట్‌గా ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలోని సాంగ్లీతోపాటు నిజామాబాద్ మార్కెట్‌లో పసుపు ధరలు సోమవారం నుంచి పెరుగుతుండటం రైతులకు కలిసి వస్తోంది.
మొన్నటి వరకు క్వింటాల్ ధర రూ.9,500 వరకు పడిపోగా ప్రస్తుతం రూ.15వేలకు చేరింది. సాంగ్లీ మార్కెట్‌లో ఏకంగా క్వింటాల్ ధర రూ.18 వేలు పలుకుతోంది. నాణ్యత ఉన్న పసుపునకు ధర బాగానే ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పసుపు ఎగుమతులకు అవకాశం ఏర్పడటం, నిలువలు తగ్గిపోవడంతో ధర హెచ్చింపు అవుతుంది. ఈసారి పసుపు విక్రయాలు మొదలైన నుంచి ధర ఆశాజనకంగానే ఉండగా మార్చి రెండో వారంలో యుద్ధ ప్రభావంతో ఒకేసారి ధర పడిపోయింది. ఎంతో ఆశతో పసుపును మార్కెట్‌కు తరలించిన రైతులు నష్టపోయి నిరాశ చెందారు. పసుపును నిలువ చేసుకున్న రైతులు, ఆలస్యంగా ఉడికించి ఆరబెట్టిన రైతులు ఈ సమయంలో పసుపును తరలిస్తుండగా ధర పెరగడంతో ఆదాయం వృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడింది.
పసుపు ధర ఇంకా పెరగాలి. పెట్టుబడి ఖర్చు లు అధికం కావడంతో క్వింటాల్‌కు రూ.20వేల వరకు ధర లభిస్తేనే రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పసుపు ఆదాయంతోనే రైతు ల కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందుతాయి. దళారుల ప్రమేయం కారణంగా ఆదాయం తగ్గిపోతుంది. – రవి, రైతు, దొన్కల్


