మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య! | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య!

Mar 12 2026 7:15 AM | Updated on Mar 12 2026 7:15 AM

మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య!

ఇందల్వాయి: ధర్పల్లి మండల మాజీ ఎంపీపీ, ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌరారం గ్రామ సర్పంచ్‌ హేమలత భర్త ఇమ్మడి గోపి(55) గౌరారం గ్రామ సబ్‌ స్టేషన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే ఇది హత్యగా తెలుస్తోంది. గౌరారం గ్రామం నుంచి అతని సొంత గ్రామం లింగాపూర్‌ వెలుతుండగా గత సర్పంచ్‌ ఎన్నికల్లో గోపి భార్యపై పోటీ చేసి ఓడిపోయిన గోపి అల్లుడు సతీశ్‌ తన కారుతో గోపి ప్రయాణిస్తున్న కారును వేగంగా ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో కత్తి దొరకడం, ప్రమాద స్థలానికి మృతదేహం దూరంగా పడి ఉండటం, వరుసకు అల్లుడు కారు ప్రమాదానికి కారణం అవ్వడం చూసి గ్రామస్తులు గోపిది హత్యే అని ఆరోపిస్తున్నారు. గత కొంత కాలంగా లింగాపూర్‌ గ్రామంలో రెండు వర్గాల మధ్య ఇసుక, భూముల విషయంలో తరుచూ తగాదాలు జరగడం, కేసులు నమోదవడం సాధారణంగా మారింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఒక వర్గానికి చెందిన బోరు బావిని గోపి సీజ్‌ చేయించడం ఇక్కడ గమనార్హం. ఇది పథకం ప్రకారం చేసిన హత్యే అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతుడు గోపికి ఇద్దరు భార్యలు ఉండగా ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. గౌరారం గ్రామానికి మొదటి భార్య వరుసగా రెండు పర్యాయాలు, రెండవ భార్య ఈ సంవత్సరం సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. మృతుడు గతంలో పీపుల్స్‌ వార్‌ గ్రూపులో క్రియాశీలకంగా పని చేసి తర్వాత జన జీవన స్రవంతిలో కలిసి పలు వ్యాపారాలు చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. గతంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి అనుచరుడిగా, ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement