తొలగిస్తారా?.. కొనసాగిస్తారా?..
అధికారుల నిర్లక్ష్యంతోనే..
స్థానికుల్లో అయోమయం..
నిజామాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరంలోని 13వ డివిజన్ సారంగపూర్‌లో మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాపై గందరగోళం నెలకొంది. సారంగపూర్‌లో గతంలో 5400 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 1900 మంది ఓట్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు పేర్కొంటూ జాబితా విడుదల చేశారు. దీంతో స్థానికులతోపాటు స్థానిక రాజకీయపార్టీల నాయకులు ఓటర్ల జాబితాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నూతన ఓట్లన్నీ స్థానికేతరులవంటూన్నారు. నగరంలోని వెంగళరావు కాలనీ, పాముల బస్తి, ముజయ్‌నగర్, నాగారం, అర్సపల్లి, ఆటోనగర్, సుభాష్ నగర్, ఆటోనగర్ కాలనీ నుంచి అక్కడి వారిని ఇక్కడి జాబితాలో చేర్చారని ఆరోపిస్తున్నారు. దీంతో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బందులు కలుగుతాయని, అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని నేతలు పేర్కొంటున్నారు.
నగరంలోని వివిధ ప్రాంతాల ఓటర్లు కేవలం కరెంట్ బిల్లుతో సారంగాపూర్‌లోని 13వ డివిజన్‌లో ఉంటున్నట్లు ఓటరుగా నమోదు చేసుకున్నారని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా వచ్చిన 1900 ఓట్లు 62, 63, 146, 147, 299, 300 బూతుల్లో నమోదయ్యాయని నేతలు పేర్కొంటున్నారు. గతంలో సారంగపూర్‌లో 5400 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళ ఓటర్లు 3000, పురుషులు 2400 మంది ఉన్నారు. ప్రస్తుతం వచ్చిన 1900 ఓట్లలో మహిళలు 1100 మంది, పురుషులు 800 మంది ఉన్నారని తెలిపారు. అక్రమ ఓట్ల విషయమై ఇటీవల మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్‌కు డివిజన్ కాంగ్రెస్ నేతలు వినతిపత్రం సైతం అందించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా నమోదైన ఓట్లను తొలగించాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 13 డివిజన్ సారంగాపూర్‌లో అక్రమంగా ఓట్లు నమోదు అయ్యాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతనంగా నమోదైన ఓటర్లను జాబితా నుంచి తొలగించాలి. ఓటరు జాబితాను పారదర్శకంగా నిర్వహించాలి. –కుంచవు నగేష్,
కాంగ్రెస్ నాయకుడు, సారంగాపూర్
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సారంగాపూర్‌లో నూతనంగా 1900 మంది ఓటర్లు నమోదు అయ్యారు. వందల సంఖ్యలో నూతన ఓటర్లు నమోదు కావడంతో స్థానికుల్లో అయోమయం నెలకొంది. అధికారులు చేసిన తప్పులకు ఓటర్ లిస్ట్ తప్పుల తడకగా మారింది.
–శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ నాయకుడు, సారంగాపూర్
13వ డివిజన్ సారంగాపూర్‌లో కొత్తగా
1900 మంది ఓటర్ల గుర్తింపు
స్థానికేతరులవి అంటూ నేతల ఆరోపణ
వెంటనే తొలగించాలంటూ
అధికారులకు ఫిర్యాదు
తొలగిస్తారా?.. కొనసాగిస్తారా?..
తొలగిస్తారా?.. కొనసాగిస్తారా?..


