పేదల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
● క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత
డిచ్‌పల్లి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ వద్ద గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను దివాళా తీసేలా చేసిందని విమర్శించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఆస్తుల పంచాయతీ నడుస్తోందని, కుటుంబ విభేదాలు బయటపడటంతోనే తట్టుకోలేక కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో రాముడి పేరు తెరపైకి తెచ్చి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్‌పల్లి, మోపాల్, జక్రాన్‌పల్లి, నిజామాబాద్ రూరల్ మండల కాంగ్రెస్ నాయకులు అమృతపూర్ గంగాధర్, ఎల్లయ్య, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


