విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
ఖలీల్‌వాడి: విద్యార్థులు లక్ష్యాలను నిర్ధేశించుకొని ముందుకు వెళ్లాలని బ్లూమింగ్ బడ్స్ స్కూల్ కరస్పాండెంట్ ఎన్. ప్రసన్న కుమారి, ప్రెసిడెంట్ పూర్ణచందర్‌రెడ్డి అన్నారు. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్–2లోని బ్లూమింగ్ బడ్స్ స్కూల్‌లో శుక్రవారం స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వారు హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలకు అనుకూలంగా ముందుకు వెళ్లాలన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. గత సంవత్సరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులను కరస్పాండెంట్ ప్రసన్న కుమారి అందజేశారు. వ్యాపారవేత్త దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


