ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
● కలెక్టరేట్‌లో ఘనంగా
సావిత్రీబాయిఫూలే జయంతి వేడుకలు
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వారు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఎస్సెస్సీ పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. నగరంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఫూలే చిత్రపటానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అత్యుత్తమ సేవలు అందించిన మహి ళా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన పిల్లలను చిన్నచూపు చూడకుండా, వారిపట్ల సానుకూల ధృక్పథాన్ని కనబరుస్తూ మరింతగా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ శా ఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార సంఘాల ఫెడరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, డీఈవో అశోక్, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
బోధన్‌టౌన్(బోధన్): ప్రభుత్వం అందించే వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు.పట్టణంలోని గ్రామ చావిడీ వద్ద నూనతంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన వైద్యపరీక్షలు చేయించుకున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, వైద్యాధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
అన్ని హంగులతో సమీకృత రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపడతాం
బోధన్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమీకృత రెసిడెన్షియల్ స్కూల్‌ను అన్ని హంగులతో నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బెల్లాల్ గ్రామంలో శుక్రవారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠి, బోధన్ సబ్ కలెక్టర్‌తో కలిసి సమీకృత రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహల నిర్మాణాల కోసం స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే పనులు ప్రారంభించి గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.


