దంపతుల ఆత్మహత్యాయత్నం
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణ శివారులో శనివారం సాయంత్రం దంపతులు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు య త్నించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం పడిగెల వడ్డెర కాలనీకి చెందిన అలకుంట రవితేజ(21), భార్య శోభ అలియాస్ లత(20) ఆర్మూర్ పట్టణ శివారులోని ఓ వెంచర్‌లో గడ్డి మందు సేవించి అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దంపతులను అంబులెన్స్‌లో పెర్కిట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. వారు చికి త్స పొందుతున్నారు. కాగా, ఇరువురికి మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. కుటుంబకలహాలతోనే దంపతులు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది.
నిందితుడి అరెస్ట్
డిచ్‌పల్లి: ట్రాక్టర్‌ను దొంగిలించిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిచ్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వినోద్ తెలిపారు. శనివారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బర్దిపూర్ శివారులో గత నెల 5న ట్రాక్టర్ చోరీకి గురైంది. ట్రాక్టర్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం నాగ్‌పూర్ గేట్ సమీపంలోని కృష్ణప్రియ దాబా ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు కామారెడ్డి జిల్లా రాజానగర్‌కు చెందిన దిండ్ల కరుణాకర్‌గా గుర్తించారు. అతను చేసిన తప్పును అంగీకరించి ట్రాక్టర్‌ను పోలీసులకు చూయించాడు. ట్రాక్టర్‌ను పీఎస్‌కు తరలించి అతన్ని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో డిచ్‌పల్లి ఎస్సై మహమ్మద్ ఆరిఫ్, సిబ్బంది పాల్గొన్నారు.
సెల్‌ఫోన్ చోరీ ఘటనలో ఇద్దరు..
నిజామాబాద్‌అర్బన్: నగరంలో గాంధీచౌక్ ప్రాంతంలో శుక్రవారం సెల్‌ఫోన్ షాపులో దొంగతనం చేసిన ఇద్దరు నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. నగరంలో బాబన్‌సాహెబ్‌పహడ్ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్, తరుణ్ గాంధీచౌక్‌లో ఉన్న ఓ సెల్‌ఫోన్ షాపులో దొంగతనం చేశారు. పోలీసులు వీరి నుంచి 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.


