నిధుల కోసం నిరీక్షణ
నిధులను విడుదల చేయాలి
మోర్తాడ్: గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోతున్నాయి. వాటి పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల కోసం సర్పంచులు ఎదురు చూపులు చూస్తున్నారు. 23 నెలలుగా నిలిచిపోయిన ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం మోక్షం కలిగిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమవుతుంది. 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ప్రతి నెలా జిల్లాకు విడుదల చేయాల్సిన మొత్తం రూ.10.30 కోట్లు ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉంటేనే నిధులను విడుదల చేయాల్సి ఉంది.
ప్రభుత్వం సకాలంలో ఎన్నికలను నిర్వహించకపోవడంతో 23 నెలల పాటు ప్రత్యేకాధికారుల పాలనలోనే గ్రామాలు కొనసాగాయి. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం ద్వారా రూ.236.95 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయనుందని సీఎం రేవంత్‌రెడ్డి పంచాయతీలపై వరాల జల్లును కురిపించారు. పెద్ద పంచాయతీలకు రూ.10లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5లక్షల చొప్పున నిధులను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కానీ సర్పంచులు బాధ్యతలు చేపట్టి పక్షం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కార్యాచరణ అమలు కావడం లేదు. దీంతో నిధుల కోసం సర్పంచులు నిరీక్షిస్తున్నారు. సీఎం చెప్పిన లెక్క ప్రకారం జిల్లాకు రూ.35 కోట్ల వరకూ నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. అటు ఆర్థిక సంఘం నుంచి భారీ మొత్తంలోనే నిధులు విడుదల కావాల్సి ఉండగా పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదికను అందించాల్సి ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్, వార్డు సభ్యులు ఉన్నారని తెలియజేస్తేనే ఆర్థిక సంఘం ద్వారా నిధులు విడుదల కానున్నాయి.
రెండేళ్లుగా ఎన్నో సమస్యలు
ఆర్థిక సంఘం నిధుల విడుదల నిలిచిపోవడం, ఎస్‌ఎఫ్‌సీ నిధుల స్థానంలో పంచాయతీ సిబ్బందికి జీతాల కోసం కొంత నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడంతో రెండేళ్ల పాటు ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి. పెద్ద పంచాయతీలకు పన్నుల ద్వారా ఆదాయం లభించగా చిన్న పంచాయతీల్లో పన్నుల ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ఈ కారణంగా పరిసరాలను శుభ్రంగా ఉంచే పరిస్థితి కూడా అక్కడక్కడ లేదు. సర్పంచులు ఎన్నిక కావడంతో నిధుల విడుదలకు మోక్షం లభిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులు సాధ్యమవుతాయి.
మోర్తాడ్ జీపీ భవనం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు నిధులను వెంటనే విడుదల చే యాలి. గ్రామల్లో ఎన్నో సమస్యలు నెలకొని ఉ న్నాయి. ఆర్థిక వనరులు ఎంతో అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలి.
– విజయ్, సర్పంచ్, శెట్‌పల్లి
గ్రామాల్లో కుంటుపడుతున్న పాలన
ఆర్థిక సంఘం నిధులు మంజూరైతేనే గ్రామాలు అభివృద్ధి
కేంద్రం నుంచి జిల్లాకు రావాల్సింది రూ. 236.95 కోట్లు
నిధుల కోసం నిరీక్షణ


