మత్స్య సంఘాలు స్మార్ట్‌గా..
సద్వినియోగం చేసుకోవాలి..
● కార్యాలయాల స్థాపన, కంప్యూటర్ల ఏర్పాటుకు నిధులు
● పీఎంఎంఎస్‌వై కింద
జిల్లాలో 215 సంఘాలు ఎంపిక
డొంకేశ్వర్(ఆర్మూర్): మత్స్య సహకార సంఘాలు స్మార్ట్‌గా మారనున్నాయి. చేపల వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు వారి భవనాల్లో కార్యాలయాలు, అందులో కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం (పీఎంఎంఎస్‌వై) కింద పూర్తి శాతం సబ్సిడీపై రుణ రూపంలో నిధులు ఇవ్వనుంది. ఈ మేరకు జిల్లాలో 215 చేపల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌ఎఫ్‌పీవోలు) ఎంపికై య్యాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ నిధుల మంజూరు దశలో ఉంది.
ఆన్‌లైన్‌లోనే క్రయవిక్రయాలు,
ధరల నిర్ణయం..
జిల్లాలో మొత్తం 398 మత్స్య సహకార సంఘాలు ఉండగా ఇందులో 24వేలకు పైగా సభ్యులున్నారు. ఎఫ్‌పీవోలుగా ఏర్పడి పట్టిన చేపలను వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు నిర్ణయించిందే ధర కావడంతో మత్స్యకారులు నష్టపోతున్నారు. ఇందుకోసం మత్స్య సహకార సంఘాలకు ఉన్న భవనాల్లోనే కార్యాలయం, ఒక కంప్యూటరు, ఫర్నీచర్ ఏర్పాటు చేస్తోంది. ఆన్‌లైన్‌లోనే చేపల క్రయవిక్రయాలు, ధరలను నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో 35మందికి పైగా సభ్యులున్న సంఘాలను గుర్తించిన మత్స్యశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 215 సంఘాలకు అర్హత లభించగా ఒక్కో సంఘానికి పూర్తి సబ్సిడీపై రూ.90వేలు ప్రభుత్వం ఇవ్వనుంది. కంప్యూటర్ల కొనుగోలు, ఫర్నీచర్ కోసం మత్స్య సంఘాలు తీర్మాణాలు చేసి ఫోటోలతో అందించాల్సి ఉంటుంది. కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ద్వారా వ్యాపారం ఏవిధంగా చేయాలనే దానిపై జిల్లాలో ఏడు స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం బాధ్యతలిచ్చింది. వీరు పర్యవేక్షణ చేసి మత్స్యకారులు తమ వ్యాపారాన్ని మెరుగు పరిచేందుకు కృషి చేస్తారు.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద జిల్లాలో 215 మత్స్య సంఘాలు ఎంపికయ్యాయి. వీటికి ప్రభుత్వం రూ.90వేల చొప్పున పూర్తి సబ్సిడీతో నిధులు ఇవ్వనుంది. వచ్చిన నిధులతో సొసైటీ భవనాల్లో ఆఫీసులు, కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలి.
–ఆంజనేయస్వామి, జిల్లా మత్స్య శాఖ అధికారి
మత్స్య సంఘాలు స్మార్ట్‌గా..


