కూరగాయల సాగుకు ప్రోత్సాహం
దరఖాస్తు చేసుకోవాలి
రైతులకు లబ్ధి చేకూరుతుంది
● ఎకరాకు రూ. 9,600
ఇవ్వనున్న ప్రభుత్వం
● దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు
ఇందల్వాయి: కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద ఒక ఎకరా సాగు చేసే రైతుకు రూ.9,600 రాయితీ రూపంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఒక ఎక రాలో కూరగాయలు సాగు చేస్తే 6 టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలు, సస్యరక్షణ చర్యలతోపాటు యాజమాన్య పద్ధతుల కింద ఎకరాకు రూ.24 వేలు ఖర్చు అవుతుందని లెక్కించింది. ఈ క్రమంలో 40 శాతం రాయితీ ఉత్పత్తిదారుల ఖాతా లో నేరుగా జమ చేయాలని ఆదేశించింది. పచ్చిమి ర్చి, క్యాప్సికం, బెండ, బీర, దొండ, కాకర, క్యాబేజీ, టమాట, చిక్కుడు, సోరకా య తదితర తోటల సాగుకు ముందుకు వచ్చే రైతులు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి రాయితీకి ఎంపిక చేస్తారు. రెండున్నర ఎకరాల వరకు రాయితీ అందించనున్నారు. సాగు ప్రారంభించి గుర్తింపు పొందిన నర్సరీలు లేదా ఉద్యానవన శాఖ నుంచి నారు లేదా విత్తనాలు కొనుగోలు చేస్తే వెంటనే నిధులు జమ చేస్తారు. రైతుల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
దరఖాస్తు విధానం ఇలా..
కూరగాయలు పండించే రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టాదార్ పాస్‌బుక్, ఆధా ర్ కార్డు, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్స్‌లతో పాటు ఒక ఫొటో, ఎరువులు, విత్తనాలు, పురుగుమందు లు, కంపోస్ట్ ఎరువులు కొనుగోలు చేసిన రసీదులు (రూ. 20వేలకు తగ్గకుండా) జత చేయాలి. ఉద్యాన శాఖ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
జిల్లాలో 1,100 ఎకరాలకు..
జిల్లాలో 1,100 ఎకరాలకు ప్రోత్సాహం అందించేలా ఉద్యానశాఖ అధికారులు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారు 225 ఎకరాల్లో కూరగాయల సాగుకు ప్రోత్సాహం అందించనున్నారు. కూరగాయల ఉత్పత్తి పెంచడం, ధరల స్థిరీకరణ, మార్కెట్‌లో సరఫరాను బలోపేతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.
కూరగాయల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నగదు ప్రోత్సహాకాన్ని పొందేందుకు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో 1,100 ఎకరాల వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. నియోజకవర్గంలో ఇదివరకే కొంత మంది రైతులకు ప్రోత్సాహం అందించాం. మరిన్ని వివరాలకు సంబంధిత ఉద్యాన శాఖ అధికారులను రైతులు సంప్రదించాలి. – రోహిత్,
ఉద్యాన శాఖ అధికారి, నిజామాబాద్ రూరల్
ఇప్పుడున్న భిన్న వాతావరణ పరిస్థితుల్లో కూరగాయలు సాగు చేయడం అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారంలా మారింది. దీంతో రైతులు కూరగాయల సాగుపై ఎక్కువగా దృష్టి సారించడం లేదు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం రైతులకు కూరగాయల సాగుకు ప్రోత్సహకాలు అందించడం సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోత్సాహకాల వల్ల కూరగాయల సాగు పెరిగి రైతులతో పాటు వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది.
– నోముల విజయ, కూరగాయల రైతు, నల్లవెల్లి
కూరగాయల సాగుకు ప్రోత్సాహం


