కొత్త సర్పంచ్‌లు వర్సెస్‌ మాజీలు | - | Sakshi
Sakshi News home page

కొత్త సర్పంచ్‌లు వర్సెస్‌ మాజీలు

Jan 3 2026 7:58 AM | Updated on Jan 3 2026 7:58 AM

కొత్త సర్పంచ్‌లు వర్సెస్‌ మాజీలు

కొత్త సర్పంచ్‌లు వర్సెస్‌ మాజీలు

పెండింగ్‌ బిల్లులను క్లియర్‌

చేయాలని మాజీ సర్పంచ్‌ల విన్నపం

తమకు సంబంధం లేదనే విధంగా కొత్త సర్పంచ్‌ల తీరు

మోర్తాడ్‌(బాల్కొండ): జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ఇటీవల నూతన పాలకవర్గాలు కొలువుతీరాయి. ఈక్రమంలో కొత్తగా ఎంపికై న సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌ల మధ్య పాత బకాయిల చెల్లింపుల వివాదం నెలకొని ఉంది. జిల్లాలోని మాజీ సర్పంచ్‌లకు వారి పదవీ కాలంలో చేసిన పనులకు సంబంధించి రూ.15 కోట్లకు పైగా బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. మాజీ సర్పంచ్‌లు తమ పదవీకాలంలో చేసిన పనులకు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బిల్లులను రెండున్నర సంవత్సరాల పాటు పెండింగ్‌లో ఉంచింది. 2023లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే పరిస్థితి పునరావృతమైంది. మాజీ సర్పంచ్‌లకు సంబంధించిన వారు కొత్తగా సర్పంచ్‌ పదవీ బాధ్యతలను స్వీకరించిన చోట ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. కొత్తగా ఎంపికై న వారిలో అనేక మంది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు ఉన్నారు. మాజీ సర్పంచ్‌లలో ఎక్కువ మంది ప్రతిపక్ష పార్టీలకు చెందినవారే ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో పాత బకాయిలకు చెల్లింపుల విషయంలో సానుకూలమైన నిర్ణయం కనిపించడం లేదు.

ప్రభుత్వం వివరాలను సేకరించినా...

మాజీ సర్పంచ్‌లు తమ బిల్లు బకాయిల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అనేకమార్లు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్కతో మాజీ సర్పంచ్‌లు తమ గోడును వెల్లబోసుకున్నారు. స్పందించిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు ముందుగానే ఏ గ్రామంలో ఎంత బిల్లు పెండింగ్‌లో ఉందనే వివరాలను సేకరించింది. ఇప్పటి వరకూ ఎలాంటి నిధులను మంజూరు చేయకపోవడంతో బిల్లు బకాయిలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి.

ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తేనే..

మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తేనే బిల్లు బకాయిలు చెల్లించడానికి మార్గం సుగమం అవుతుందనే అభి ప్రాయం వ్యక్తం అవుతోంది. గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం పెద్ద పంచాయతీలకు రూ.10లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆయన ప్రకటనను పరిశీలిస్తే బకాయిల చె ల్లింపుల కోసం ఈ నిధులు కాదనే అంశం వెల్లడవుతుంది.ఈ నేపథ్యంలో పెండింగ్‌ బకాయిల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను విడుదల చేసేందుకు చొరవ చూపితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రభు త్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

మోర్తాడ్‌ మండలంలోని సుంకెట్‌ గ్రామంలో శుక్రవారం జీపీ పాలకవర్గ సమావేశం నిర్వహించగా మాజీ సర్పంచ్‌ కడారి శ్రీనివాస్‌ వెళ్లి తనకు రూ.18లక్షల బిల్లులు రావాల్సి ఉందని వివరించారు. పాత బిల్లుల విషయంతో తమకు సంబంధం లేదని ఆ బిల్లులు చెల్లిస్తే అభివృద్ధి ఎలా చేయగలమని పాలకవర్గం సభ్యులు ప్రశ్నించారు. ఈక్రమంలో సర్పంచ్‌, మాజీ సర్పంచ్‌ మధ్య కొంత వివాదం ఏర్పడిందనేది స్పష్టమైతుంది. ఇది ఒక్క సుంకెట్‌లోనే ఎదురైన పరిస్థితి కాదు. జిల్లా వ్యాప్తంగా అనేక పంచాయతీలలో ఇదే పరిస్థితి ఎదురవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement