ఒకేరోజు వ్యవధిలో దంపతులు మృతి
యాద్గార్‌పూర్‌లో విషాదఛాయలు
రుద్రూర్: భర్త మరణించిన రెండోరోజే భార్య మృతి చెందిన ఘటన కోటగిరి మండలం యాద్గార్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయబోయి (70) నెలరోజుల క్రితం అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు భార్య లచ్చవ్వ(65) నెలరోజులుగా సేవలు చేసింది. ఆరోగ్యం విషమించి మంగళవారం సాయిబోయి మృతి చెందగా బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. గురువారం ఉదయం మృతుడి కుటుంబీకులు శ్మశానానికి వెళ్లి ఖననం చేసిన ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా సాయబోయి భార్య లచ్చవ్వ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బుధవారం భర్త అంత్యక్రియలు నిర్వహించగా, గురువారం భార్య అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని కుటుంబీకులు రోదించారు. నూతన సంవత్సరం వేళ భార్యాభర్తలు మృతి చెందడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


