మీ ఊరికి మీరే సీఎం..
డిచ్‌పల్లి(నిజామాబాద్ రూరల్): ఉన్న ఊరు కన్నతల్లితో సమానం.. అలాంటి ఊరికి సేవ చేసుకునే అవకాశం సర్పంచులకు ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. మీ ఊరికి మీరే సీఎం అని, యువతను కలుపుకొంటూ వెళ్లి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సర్పంచులకు సర్వాధికారాలు ఉంటాయని ఏ సీఎంతోనూ అవసరం లే దన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆత్మీయ సన్మాన సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన 98 మంది స్వచ్ఛంగా బీజేపీ వ్యక్తులేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుందని.. ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతోనే గ్రామాలకు నిధులు రాలేదన్నారు. ఇప్పుడు రావాల్సిన నిధులు ఆటోమెటిగ్గా కేంద్రం నుంచి వచ్చేస్తాయని తెలిపారు. పారదర్శకంగా, అవినీతి లేకుండా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 12 వేల గ్రామ పంచాయతీలుండగా.. వచ్చేసారి 98 శాతం పంచాయతీల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ఈ ఎన్నికలు బీజేపీ విజయాలకు ప్రారంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో మరికొంత మంది ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కౌన్సిలర్లుగా గెలువబోతున్నారని ఆశాభావం వ్య క్తం చేశారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సర్పంచ్ తమ గ్రా మాన్ని ఆదర్శమైన పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. సర్పంచులుగా గెలిచిన వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా బీజేపీ ఎమ్మెల్యేలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికై న వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, మేడిపాటి ప్రకాశ్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మోరపల్లి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, బీజేవైఎం జి ల్లా అధ్యక్షుడు పానుగంటి సతీశ్ రెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వర్, పద్మారెడ్డి, జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను మోసగించిన కేసీఆర్
ఉద్యమ నాయకుడని నమ్మి తెలంగాణ రాష్ట్రా న్ని కేసీఆర్ చేతిలో పెడితే ప్రజలను మోసగించి కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు దోచుకుందని ఎంపీ అర్వింద్ అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు తాను కూడా అభిమానినే తెలిపారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వ మ్ము చేసిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను కేసీఆర్ కుటుంబం నాశనం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిజంగా పాలమూరు బిడ్డవు అయితే... కేసీఆర్ కుటుంబాన్ని జైళ్లో వేయాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. ప్యాకేజీలకు అమ్ముడుపోవద్దని సూచించారు. ప్రజా గ్రహానికి గురైతే ఎలా ఉంటుందో ఓ ఎమ్మెల్సీని చూస్తే తెలుస్తోందని అన్నారు. ప్రజలకు ఆగ్రహం కలిగితే ఎంతటి వారైనా రాజకీయంగా భూగర్భంలో కలిసిపోవాల్సిందేనన్నారు.
యువతతో కలిసి గ్రామాభివృద్ధికి
కృషి చేయాలి
నూతన సర్పంచ్‌లకు ఎంపీ
ధర్మపురి అర్వింద్ పిలుపు
బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్,
వార్డుమెంబర్లకు ఆత్మీయ సన్మానం


