పసుపు దిగుబడిపై ఆశలు
డొంకేశ్వర్(ఆర్మూర్): రైతులు దాదాపు ఎనిమిది నెలలపాటు సాగు చేసిన పసుపు పంట కోత దశకు చేరుకుంది. మరో వారం, పది రోజుల్లో పంట చేతికి రానుంది. పసుపును తవ్వేందుకు మహారాష్ట్ర నుంచి కూలీలు జిల్లాకు చేరుకుంటుండగా, పలుచోట్ల ఆకు కోతలు మొదలయ్యాయి. అయితే, ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా పంటను చీడపీడలు ఆశించాయి. అక్టోబర్ వరకూ వర్షాలు కురవడంతో పంటలో నీరు నిలిచి దుంపకుళ్లు, వేరుకుళ్లు వైరస్ బారినపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకులకు మర్రాకు తెగులు సోకి పంట సక్రమంగా ఎదగలేదని రైతులు చెప్తున్నారు. దీంతో వారికి దిగుబడిపై గుబులు పట్టుకుంది. జిల్లాలో ఈ ఏడాది 23,611 ఎకరాల్లో పసుపు పంటను సాగు చేశారు. మార్కెట్‌లో మంచి ధర ఉందనే ఆశతో గతేడాది కంటే 700 ఎకరాలు ఎక్కువగా పంటను వేశారు. అయితే, వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా దిగుబడి 60 శాతానికి తగ్గే అవకాశం ఉంది. సాధారణంగా ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 15–20 క్వింటాళ్లు రావొచ్చని రైతులు అంటున్నారు. ఉద్యాన శాఖ అధికారులు సైతం సర్వే చేసి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.
కోత దశకు చేరుకుంది..
నాలుగు ఎకరాల్లో పసుపు సాగు చేశాను. ఇప్పుడు కోత దశకు చేరుకుంది. సంక్రాంతికి ముందర పంట తవ్వి కొ మ్ములను బయటకు తీస్తాం. ఈయేడు అధిక వర్షాలతో జిల్లా అంతటా పంట దిగుబడి తగ్గే అవకాశం కనిపిస్తోంది. దిగుబడి ఎంత వస్తుందోనని రైతులు ఆందోళనగా ఉన్నారు. – గోక భోజారెడ్డి, డొంకేశ్వర్
జిల్లాలో 23,611 ఎకరాల్లో పంట సాగు
వారం, పది రోజుల్లో ప్రారంభం కానున్న కొమ్ముల తవ్వకం
అధిక వర్షాల కారణంగా
దిగుబడి తగ్గే అవకాశం
పసుపు దిగుబడిపై ఆశలు


