పాత పద్ధతిలోనే యూరియా!
డొంకేశ్వర్(ఆర్మూర్): యూరియా బుకింగ్ యాప్ సరిగ్గా పని చేయకపోవడంతో ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే ఎరువులను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. సొసైటీలు, డీలర్ల వద్దకు వెళ్లి యూరియా బస్తాలు కొనుగోలు చేసుకోవాలని రైతులకు సూచించింది. అయితే, ఇది తాత్కాలికం మాత్రమేనని, యాప్‌లో లోపాలను సరిదిద్దిన తర్వాత మళ్లీ ఆన్‌లైన్ ద్వారానే యూరియాను కొనుగోలు చేయాల్సి ఉంటుందని వ్యవసాయాధికారులు తెలిపారు. యూరియా పంపిణీలో పటిష్టం, పారదర్శకత కోసం ప్రభుత్వం ‘యూరియా బుకింగ్ యాప్’ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనిని ఈ నెల 20 నుంచి అమల్లోకి తేగా రాష్ట్రంలోని నిజామాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ప్రయోగించారు. ఆదిలోనే యాప్ సక్రమంగా పని చేయలేదు. వివరాలు నమోదవ్వక రైతులు ఇబ్బందులు పడ్డారు. బుకింగ్ సిస్టంను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో యాసంగికి ఎరువుల కొనుగోలు చేయడానికి ఆందోళన చెందారు. దీంతో ప్రభుత్వం యాప్‌లో ఎదురైన ఇబ్బందులను సరిదిద్దే పనిలో ఉంది. అప్పటి వరకు రైతులకు పాత పద్ధతిలోనే యూరియా అందించాలని వ్యవసాయాధికారులకు సూచించింది.
ఊపందుకున్న యూరియా కొనుగోళ్లు...
యాసంగి సీజన్ పంటల సాగు వేగం పుంజుకోవడంతో జిల్లాలో యూరియా కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లాలో 4.30 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా ఉండగా ఇప్పటి వరకు 1.25 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. వలస కూలీలు రావడంతో నాట్లు వేగంగా జరుగుతున్నాయి. మొక్కజొన్న కూడా అంచనాకు మించి 31,790 ఎకరాల్లో సాగైంది. దీంతో పంటలకు అవసరమైన పూర్తి యూరియాను రైతులు ఇప్పుడే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. యాసంగికి 82,055 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని వ్యవసాయ శాఖ ఇండెంట్ పంపగా ఇప్పటి వరకు బఫర్ స్టాక్‌తో కలిపి 51,091 మెట్రిక్ టన్నులు జిల్లాకు వచ్చింది. ఇందులో ఇప్పటికే 36 వేల మెట్రిక్ టన్నులు అమ్ముడైంది. విడతల వారీగా మిగతా కోటా కూడా జిల్లాకు తెప్పించడానికి వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతోంది.
బుకింగ్ విధానాన్ని అలవాటు చేసుకోవాలి
యూరియా బుకింగ్ యాప్‌లో కొన్ని లోపాలు ఏర్పడిన విషయం వాస్తవమే. రైతులు సాగు చేస్తున్న పంటలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు పాత పద్ధతిలోనే యూరియా అందించాలని నిర్ణయించాం. ఇది తాత్కాలికం మాత్రమే. కొన్ని రోజుల తర్వాత యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటేనే యూరియా పంపిణీ జరుగుతుంది. అప్పటి వరకు రైతులు యాప్‌ను అలవాటు చేసుకోవాలి. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి
బుకింగ్ యాప్‌లో లోపాలను
సరిదిద్దుతున్న ప్రభుత్వం
సొసైటీలు, డీలర్ల వద్ద కొనుగోలు
చేసుకోవాలని రైతులకు సూచన
కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆన్‌లైన్ విధానమే అంటున్న వ్యవసాయ
అధికారులు
పాత పద్ధతిలోనే యూరియా!


